Share News

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నందుకు కత్తి దూశాడు

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:11 AM

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారిన పదహారేళ్ల బాలుడు దురాగతమిది. మొబైల్‌ లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడొద్దన్నందుకు కన్నవారిపైనే కాలయముడిగా మారాడు. తల్లిదండ్రులతోపాటు సోదరిపై కత్తితో దాడి చేశాడు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నందుకు కత్తి దూశాడు

  • తల్లిదండ్రులు, అక్కపై మచ్చుకత్తితో దాడి

  • తానూ గొంతుకోసుకున్న బాలుడు

  • తండ్రి, అక్క మృతి.. మృత్యువుతో తల్లి పోరు

  • బాలుడి పరిస్థితి ఆందోళనకరం

బళ్లారి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారిన పదహారేళ్ల బాలుడు దురాగతమిది. మొబైల్‌ లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడొద్దన్నందుకు కన్నవారిపైనే కాలయముడిగా మారాడు. తల్లిదండ్రులతోపాటు సోదరిపై కత్తితో దాడి చేశాడు. తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ దాడిలో తండ్రి, సోదరి చనిపోగా, తల్లి, కుమారుడు మృత్యువుతో పోరాడుతున్నారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా అయోధ్య కాంపులో శనివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామా ఎల్‌ అరసిద్ధి కథనం మేరకు.. గంగావతి సమీపంలోని అయోధ్య క్యాంపులో నివాసముంటున్న వెంకటనాయుడు (45), సౌజన్య దంపతులకు కూతురు ప్రగతి(18), కుమారుడు వెంకట మణిదీప్‌(16) ఉన్నారు. వెంకటనాయుడు తల్లిదండ్రులు కూడా వారితోనే ఉంటున్నారు. వారింట్లో మూడు పడకగదులు ఉన్నాయి. శనివారం రాత్రి భోజనాల అనంతరం నిద్రించేందుకు వారి వారి పడక గదుల్లోకి వెళ్లిపోయారు. మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసైన మణిదీప్‌ను అక్క ప్రగతి మందలించింది. అందరూ నిద్రపోకుండా ఏమిటీ శబ్దం అంటూ సీరియస్‌ అయింది. అక్కపై తమ్ముడు చేయి చేసుకుంటుంటే తల్లిదండ్రులు మందలించారు. మణిదీప్‌ చేతిలోని మొబైల్‌ ఫోన్‌ లాక్కుని, పక్కన పడేశారు. దీంతో మణిదీప్‌ ఒక్కసారిగా ఇంట్లో పొలం పనులు చేసేందుకు ఉంచిన మచ్చుకత్తిని తీసుకొచ్చి ముందుగా అక్కను నరికాడు. అడ్డువచ్చిన తల్లిండ్రులనూ తలపై నరికాడు. చేతులు అడ్డుపెట్టగా వాటిపైనా నరికాడు.


అందరూ హాహాకారాలు చేశారు. పక్క రూములో ఉండే వెంకటనాయుడు తల్లిదండ్రులు రాకుండా గది తలుపునకు గడియ పెట్టాడు. తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకుని పడిపోయాడు. గది తలుపు బద్దలుకొట్టి వృద్ధులు బయటికొచ్చి చూడగా.. అప్పటికే ప్రగతి(18) కన్నుమూసింది. రక్తపు మడుగులో పడిఉన్న వెంకటనాయుడును బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించిగా అక్కడ మరణించాడు. సౌజన్య, మణిదీప్‌ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. వెంకటనాయుడు వ్యవసాయ పనులతో పాటు అయోధ్య క్యాంపులోని ఓ ప్రైవేటు పాఠశాలలో వంట చేస్తుండేవాడని తెలిపారు. దాడికి మణిదీప్‌ కారణమా, వేరేవారు కూడా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.

Updated Date - Jun 08 , 2026 | 04:13 AM