Share News

బెట్టింగ్‌ మహమ్మారికి ఇద్దరు యువకుల బలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:52 AM

తక్కువ సమ యంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసలైన ఇద్దరు యువకులు..

బెట్టింగ్‌ మహమ్మారికి ఇద్దరు యువకుల బలి

  • అప్పుల ఊబిలో చిక్కుకుని బలవన్మరణాలు

ఇందల్‌వాయి/చౌటుప్పల్‌ రూరల్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తక్కువ సమ యంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసలైన ఇద్దరు యువకులు.. లక్షలాది రూపాయలు నష్టపోయి, అప్పుల ఊబిలో కూరుకు పోయారు. చివరకు ఆ అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన పనస అనిల్‌ (28) ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఉచ్చులో పడి రూ.15 లక్షలకు పైగా నష్టపోయాడు. లోన్‌ యాప్‌ల ద్వారా అప్పు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఆ అప్పుల భారాన్ని తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి సిర్నాపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు వదిలాడు. మంగళవారం తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తంగెడపల్లి గ్రామానికి చెందిన బాలగోని పవన్‌కుమార్‌(27) ఇదే తరహాలో తనువు చాలించాడు. స్థానికంగా పశువుల దాణా దుకాణం నిర్వహించే పవన్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటుపడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. గతంలో ఒకసారి తండ్రి మందలించినా మళ్లీ అదే వ్యసనానికి లోనై భారీగా అప్పులు చేశాడు. ఈ క్రమంలో తండ్రి మందలిస్తాడని మనస్తాపానికి గురైన పవన్‌ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - Jan 21 , 2026 | 04:52 AM