200 కోట్ల గంజాయి!
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:33 AM
ఆంధ్ర, ఒడిశాఖ సరిహద్దులోని దండకారణ్యమది! అక్కడికి వెళ్లడం అత్యంత కష్టతరం. ఈ ప్రాంతంలోనే ప్రముఖ నటి అనూష్కశెట్టి ప్రధాన పాత్రగా ఘాటీ సినిమా చిత్రీకరించారు.
ఒడిశాలో భారీగా లిక్విడ్ గంజాయి పట్టివేత
మరో రూ.5 కోట్ల ముడి గంజాయి కూడా
కొరాపుట్ ఎస్పీ రోహిత్‌వర్మ నేతృత్వంలో ప్రత్యేక ఆపరేషన్
జోలాపుట్ రిజర్వాయర్ గుండా పడవల్లో ఏవోబీకి
దండకారణ్యంలో అణువణువూ జల్లెడ
సాలూరు రూరల్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశాఖ సరిహద్దులోని దండకారణ్యమది! అక్కడికి వెళ్లడం అత్యంత కష్టతరం. ఈ ప్రాంతంలోనే ప్రముఖ నటి అనూష్కశెట్టి ప్రధాన పాత్రగా ఘాటీ సినిమా చిత్రీకరించారు. గంజాయిని ఎలా రవాణా చేయాలనేదే ఈ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం! గంజాయిని ద్రవరూపంలోకి మార్చడం, దాన్ని చాకచక్యంగా రవాణా చేయడం చూపించారు. ఆ సన్నివేశాలనే స్మగర్లు ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. ఏవోబీ కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల పరిధిలోని కటాఫ్ అడవుల్లో ఏకంగా గంజాయిని లిక్విడ్‌గా తయారు చేసే యూనిట్‌నే నెలకొల్పారు. అక్కడ గుట్టుగా గంజాయిని లిక్విడ్‌గా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు స్మగింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొరాపుట్ ఎస్పీ రోహిత్‌వర్మ గురువారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఆ ప్రాంతానికి చేరుకోవడానికి సిబ్బందితో జోలాపుట్ రిజర్వాయర్‌లో పడవల్లో వెళ్లారు. రిజర్వాయర్ ఒడ్డు నుంచి నిర్దేశిత ప్రాంతానికి కాలినడకన చేరుకున్నారు. తయారీ యూనిట్‌పై దాడి చేశారు. అప్పటికే స్మగ్లర్లు పలాయనం చిత్తగించారు. తయారీ యూనిట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన 1800 లీటర్ల లిక్విడ్ గంజాయి, మరో రూ.5 కోట్ల విలువైన 1000 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి ధర సుమారు రూ.200 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. తయారీదారులను గుర్తించామని, త్వరలో పట్టుకుంటామని కొరాపుట్ ఎస్పీ రోహిత్‌వర్మ, డీఐజీ విశాల్‌సింగ్ వెల్లడించారు.
మరో 5 కోట్ల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్ట్
మరో ఘటనలో.. నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముంచంగిపుట్ వైపు రెండు వాహనాల్లో రూ.5 కోట్ల విలువైన 1,148 కిలోల గంజాయిని తరలిస్తున్న వారిని గురువారం ఒడిశాలోని నందపూర్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు రెండు వాహనాలను సీజ్ చేశారు. గంజాయిని రవాణా చేస్తున్న సిమిలిగుడ, కొరాపుట్‌లకు చెందిన ఇద్దరు, హరియాణాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.
గంజాయి రవాణాను కట్టడి చేద్దాం
పరస్పర సహకారంతో ఏవోబీలో ఆదిలోనే అరికడదాం
తక్షణ సమాచార మార్పిడికి ప్రత్యేక కమ్యూనికేషన్ వేదిక
వర్చువల్ సమావేశంలో ఆంధ్రా-ఒడిశా పోలీసుల నిర్ణయం
విజయవాడ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గంజాయి మూలాలను ఛేదిందుకు రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఏవోబీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే గంజాయిని సమన్వయంతో ఆదిలోనే అరికట్టాలనే గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయానికి వచ్చారు. ఏపీ ఐజీపీ రవికృష్ణ, ఒడిశా ఐజీపీ డాక్టర్ సార్థక్ సారంగి, సదరన్ రేంజ్ ఐజీపీ నితిశేఖర్, సౌత్ వెస్ట్రన్ రేంజ్ విశాల్‌సింగ్, విశాఖపట్నం రేంజ్ ఐజీపీ గోపీనాథ్, ఎన్‌సీబీ జోనల్ డెరెక్టర్ పంకజ్ ద్వివేది, ఒడిశా జోనల్ డైరెక్టర్ కుల్దీప్ శర్మ, ఈగల్ అడ్మిన్ నాగేశ్‌బాబుతో పాటు రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల ఎస్పీలు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. గత 12 నెలల్లో జరిగిన ఎన్‌డీపీఎ్‌స ధోరణులపై సమగ్ర నివేదికను ఇరు రాష్ట్రాల పోలీసులు సమర్పించారు. గంజాయి అక్రమ సాగు, పెరుగుతున్న సంఘటిత ముఠాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉత్పత్తి, రవాణా, పంపిణీదారులపై కేంద్రీకృత దాడులు అవసరమనే నిర్ణయానికి వచ్చారు. దీని కోసం రెండు రాష్ట్రాల్లో నోడల్ అధికారులను నియమించాలని, తక్షణ సమాచార మార్పిడి కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ వేదికను ఏర్పాటు చేసుకోవాలని, నేరస్థుల వివరాలను పరస్పరం పంచుకోవాలని, హాట్‌స్పాట్లలో సంయుక్త ఆపరేషన్లకు నియమిత సమీక్షా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర సహకారంతో ముందుకు సాగాలనే కట్టుబాటుకు వచ్చారు.