వ్యాపారం పేరుతో లక్షల్లో మోసాలు..ఎన్‌ఆర్‌ఐ పూజారి అరెస్టు
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:00 AM
పూజలు, వ్యాపారం పేరుతో బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేసి విదేశాలకు పారిపోయిన ఓ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా నుంచి భారత్‌కు ..
నిజాంపేట్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): పూజలు, వ్యాపారం పేరుతో బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేసి విదేశాలకు పారిపోయిన ఓ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన అతడిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. చామర్తి రామ లచ్చారావు అనే పూజారి వ్యాపారం పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రూ.20 లక్షలు తీసుకొని తిరిగి చెల్లించకుండా మోసం చేశాడు. డబ్బులు అడిగిన బాధితుడిని చేతబడి చేసి కుటుంబ సభ్యులతో సహా చంపేస్తామని బెదిరించాడు. ఈ ఘటనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో 2025లో ఏప్రిల్ 29న కేసు నమోదైంది. తర్వాత అమెరికాకు పారిపోయిన నిందితుడు అక్కడ కూడా ఇదే విధంగా మోసాలు చేయడం, గుడికి వచ్చే ఆదాయాన్ని సైతం ఇతరుల ఖాతాల్లోకి జమ చేయడంతో అక్కడ కూడా కేసులు నమోదైనట్లు సమాచారం. అక్కడ ఓ ఆలయ యజమాని కేసులు నమోదు చేయడంతో భయపడి భారత్‌కు వచ్చిన సమయంలో విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.