Share News

బతకాలని లేదు!

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:37 AM

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో సోమవారం.. కుమారుడు సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత సమస్యలతో తమకు బతకాలని లేదంటూ మరణ వాంగ్మూలం....

బతకాలని లేదు!

  • ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం

  • కుమారుడు సహా ఇంట్లోనే దంపతుల ఉరి

  • ముగ్గురి సంతకాలతో మరణ వాంగ్మూలం

  • తమ తదనంతరం ఆస్తుల అప్పగింత..

  • తమ అంత్యక్రియలకు బంధువుల ఫోన్‌ పేకు నగదు జమ

  • నెల్లూరు జిల్లా సంగంలో పెను విషాదం

సంగం, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో సోమవారం.. కుమారుడు సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత సమస్యలతో తమకు బతకాలని లేదంటూ మరణ వాంగ్మూలం లేఖ రాయడంతోపాటు అందులో వారి ఆస్తుల పంపకాలు కూడా పేర్కొన్నారు. పోలీసుల కథనం మేరకు.. దువ్వూరులో ఉంటున్న చీరాల మధుసూదన్‌రావు (65) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి ఆరేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఈయనకు భార్య రత్నావళి (50), కుమారుడు సాయి సుకృత్‌ (26) ఉన్నారు. సాయి సుకృత్‌ బీటెక్‌ పూర్తి చేసి, కొంతకాలం కిందట తిరుపతిలో ఉద్యోగంలో చేరాడని, అప్పటి నుంచి తల్లిదండ్రులు అప్పుడప్పుడు తిరుపతికి వెళ్లి వచ్చేవారని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారం క్రితం కుమారుడి వద్దకు వెళ్లి శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. అదే ఊరిలో మధుసూదనరావు పిన్నమ్మ కుమార్తె దొరసానమ్మ ఉంటోంది. ఆమె అప్పుడప్పుడు మధుసూదన్‌రావు ఇంటికి వచ్చి వెళుతుంటుంది. ఆదివారం రాత్రి పొద్దు పోయిన తరువాత దొరసానమ్మకు మధుసూదనరావు ఫోన్‌ చేసి ఉదయం ఇంటికి రమ్మని చెప్పారు. దీంతో ఆమె సోమవారం ఉదయం ఇంటికి వచ్చి.. తలుపు తట్టింది. ఎవరూ తలుపు తీయలేదు. కాలింగ్‌ బెల్‌ నొక్కినా.. గట్టిగా అరిచి పిలిచినా ఎవరూ పలకలేదు. అనుమానం వచ్చి లోపల చేతికి అందే దూరంలో తాళంచెవి ఉంటే.. వీధిలో ఉన్న ఓ వ్యక్తిని పిలిచి తాళం తీయమంది. ఆయన తాళం తీశాక లోపలికి వెళ్లి చూడగా.. హాలులో భార్యాభర్తలు, పడక గదిలో కుమారుడు సాయి సుకృత్‌ ఉరికి వేలాడుతూ కనిపించారు. భయపడిన దొరసానమ్మ చుట్టు పక్కల వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించింది.


కాళ్లూ చేతులు కట్టుకుని..!

కుమారుడు సహా దంపతులు తమ కాళ్లు, చేతులను లుంగీ, పంచెతో కట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాయి సుకృత్‌ రెండు చేతులను వైపు వైపు కట్టి ఉండగా, రత్నావళి, మధు చేతులను మాత్రం ముందు వైపు కట్టి ఉంది. మధుసూదనరావే ముందుగా భార్యకు, కుమారికి కాళ్లూచేతులు కట్టి ఉరివేసి.. ఆ తర్వాత తనూ చేతులకు తువ్వాలు చుట్టుకుని ఉరికి వేలాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరణ వాంగ్మూలం

పోలీసులు మృతదేహాలను కిందికి దించిన అనంతరం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. తమ మరణ వాంగ్మూలం నోట్‌ బీరువాలో ఉందంటూ మధుసూదనరావు ఓ తెల్లకాగితంపై రాసి గోడకు అతికించగా, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తాము సామాజికంగా, మానసికంగా బలహీనంగా ఉన్నామని, తమ కుమారుడు కూడా బలహీనుడేనని, అమాయకుడని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఈ సమాజంలో ఎలా బతకాలో తెలియక, భవిష్యత్తులో బతకాలని లేక మరణ వాంగ్మూలం రాసి చనిపోతున్నాము’ అని పేర్కొన్నారు. వారి ఆస్తులు ఎవరికి చెందాలో కూడా వీలునామాలో పేర్కొన్నారు. అంత్యక్రియలు, కర్మకాండలకు బంధువుల ఫోన్‌ పేకు నగదు జమ చేసినట్లు వీలునామాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణ సమయంలోనూ సామాజిక స్పృహతో ఓ స్థలాన్ని నెల్లూరు రెడ్‌క్రాస్‌ సంస్థకు రాశారు.

Updated Date - Jun 16 , 2026 | 06:20 AM