ప్రయాణికులపైకి దూసుకొచ్చిన బస్సు
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:49 AM
నెల్లూరులోని ఆర్టీసీ ప్రధాన బస్టాండులో గురువారం ఓ బస్సు ప్లాట్‌ఫారం దాటి లోపలికి దూసుకొచ్చింది. దీంతో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
నెల్లూరు బస్టాండ్‌లో ఘటన.. ఐదుగురికి గాయాలు.. డ్రైవర్ పరార్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నెల్లూరులోని ఆర్టీసీ ప్రధాన బస్టాండులో గురువారం ఓ బస్సు ప్లాట్‌ఫారం దాటి లోపలికి దూసుకొచ్చింది. దీంతో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రొట్టెల పండగ సందర్భంగా గురువారం బస్టాండు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో నెల్లూరు నుంచి సోమశిలకు వెళ్లే ఆర్టీసీ అద్దె బస్సు ప్లాట్‌ఫారం మీదకు వచ్చింది. అయితే, నిర్దేశిత స్థలంలో బస్సు ఆగకుండా బస్టాండు లోపల ఉన్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో అక్కడివారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం కాగా, ఘటన జరిగిన వెంటనే పరారయ్యాడు. ప్రమాదంలో చింతాత్మకూరుకు చెందిన ఎస్.కృష్ణయ్య, బుజ్జమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారితోపాటు స్వల్ప గాయాలైన మరో ముగ్గురిని నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదిచ్చారు.