ప్రియురాలిని చంపేసి.. ముక్కలుగా కోసేసి..
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:58 AM
ప్రియురాలిని ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేశాడు. తర్వాత శవాన్ని ముక్కలుగా కోసం మాయం చేయాలనుకున్నాడు. కొన్ని భాగాలను దూరంగా తీసుకెళ్లి కాల్చేశాడు.
మొండెం ఫ్రిజ్‌లో.. కొన్ని భాగాలు ప్లాస్టిక్ కవర్‌లో..
చేతులు, తల ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి బైక్‌పై తీసుకెళ్లి కాల్చివేత
విశాఖలో నేవీ ఉద్యోగి ఘాతుకం
విశాఖపట్నం/గాజువాక, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ప్రియురాలిని ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేశాడు. తర్వాత శవాన్ని ముక్కలుగా కోసం మాయం చేయాలనుకున్నాడు. కొన్ని భాగాలను దూరంగా తీసుకెళ్లి కాల్చేశాడు. కొన్నింటిని ఇంట్లోనే దాచి పెట్టాడు. తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో ఓ నేవీ ఉద్యోగి చేసిన ఘాతుకం సంచలనం సృష్టించింది. పోలీసుల విచారణలో విస్మయపరిచే వివరాలు నిందితుడు వెల్లడించాడు. పోలీసులు సోమవారం నిందితుడిని సంఘటనా స్థలికి తీసుకువెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీస్ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన 29 ఏళ్ల చింతాడ రవీంద్ర నేవీలో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా విశాఖలో పనిచేస్తున్నాడు. విశాఖ నగరంలోని కైలాసపురంలో ఉంటూ ఓ జాతీయ బ్యాంకులో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మౌనిక (31)తో 2021లో ‘మింగిల్’ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చినా అనివార్యకారణాల వల్ల జరగలేదు. 2023లో విజయనగరానికి చెందిన బంధువుల అమ్మాయి శ్రీలక్ష్మిని రవీంద్ర వివాహం చేసుకుని గాజువాక ఎల్‌వీ నగర్‌లో కీర్తి ఎన్‌క్లేవ్ అపార్టుమెంట్‌లో అద్దెకు దిగాడు. ప్రససం కోసం భార్యను ఆరు నెలల క్రితం పుట్టింటికి పంపాడు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉండటంతో రవీంద్రతో పాటు ఫ్లాట్‌లో తన సోదరుడు, మరో స్నేహితుడు ఉంటున్నారు. ఇదిలాఉండగా మౌనిక తరచూ డబ్బులు అడుగుతోందని, ఇవ్వకుంటే ఉద్యోగం పోగొడతానని, తన భార్య, కుటుంబసభ్యులకు వీడియోలు, ఫొటోలు పంపించి పరువు తీసేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తోందని రవీంద్ర చెప్పాడు. రూ. 3.5 లక్షలు వరకు ఇచ్చినా, ఇంకా కావాలని వేధిస్తుండడంతో అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం తన సోదరుడు, స్నేహితుడు ఫ్లాట్‌లో లేని సమయంలో ఆదివారం ఉదయం మౌనికకు తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లి బెడ్‌మీద పడేసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
మౌనిక మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి ఆన్‌లైన్‌లో కత్తి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాడు. తల, చేతులు వేరు చేసి ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కాడు. మొండెంను పాలిథిన్ కవర్‌లో పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాడు. కాళ్లు, ఇతర భాగాలను మరొక సంచిలోవేసి ఇంట్లోనే ఉంచాడు. ట్రావెల్ బ్యాగ్ పట్టుకుని బైక్‌పైన సింహాచలంలోని ధారపాలెం వద్ద తోటల్లోకి వెళ్లి కాల్చేశాడు. అనంతరం హత్య విషయాన్ని సోదరుడితో పాటు స్నేహితుడికి చెప్పాడు. వారి సూచనతో రవీంద్ర ఆదివారం రాత్రి గాజువాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు అతని ఫ్లాట్‌కు వెళ్లి పరిశీలించగా, ఫ్రిజ్‌లో, మరో మూటలో శరీర భాగాలు గుర్తించారు. సోమవారం ఉదయం నిందితుడిని ధారపాలెంలో తల, చేతులు దహనం చేసిన ప్రాంతానికి తీసుకువెళ్లారు. విశాఖ సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక సీఐ ఎ.పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు.
రవీంద్రను కఠినంగా శిక్షించాలి
నా కుమార్తెపై రవీంద్ర చేస్తున్న ఆరోపణల్లో ఎంత మా త్రం వాస్తవం లేదు. అతడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు మా కు తెలియదు. నగదు కోసం మౌనిక వేధిస్తున్నట్టు రవీంద్ర చెప్పడం ఎంతమాత్రం సరికాదు. మాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం కూడా నా కుమార్తెకు లేదు. నా కుమార్తెను దారుణంగా హత్య చేసిన రవీంద్రను కఠినంగా శిక్షించాలి.
- మృతురాలి తండ్రి వేణుగోపాల్
