Share News

ఆ నలుగురిని చంపింది ఒక్కడే

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:11 AM

నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైన కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్యల వెనుక సుపారీ గ్యాంగ్‌ హస్తముందని తొలుత భావించినప్పటికీ..

ఆ నలుగురిని చంపింది ఒక్కడే

  • వీడిన నల్లగొండ హత్య కేసు మిస్టరీ.. హతురాలు హసీనా అల్లుడు సయ్యద్‌ అస్లామే హంతకుడు

  • వ్యక్తిగత కక్ష, డబ్బు, బంగారం కోసమే ఘాతుకం

  • పోలీసులకు దొరకకూడదని యూట్యూబ్‌ వీడియోలు చూసి ప్లాన్‌

  • అస్లాం సహా నలుగురి అరెస్టు

నల్లగొండ క్రైం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైన కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్యల వెనుక సుపారీ గ్యాంగ్‌ హస్తముందని తొలుత భావించినప్పటికీ.. వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు, ఆ ఇంట్లోని డబ్బు, బంగారాన్ని దోచుకునేందుకే ఒకేఒక్కడు ఈ ఘాతుకానికి తెగబడినట్టు తేలింది. మృతుల్లో ఒకరైన హసీనా అల్లుడు సయ్యద్‌ అస్లాం ఒక్కడే ఈ హత్యలు చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడు సయ్యద్‌ అస్లాం, అతనికి సహకరించిన తబుస్సుం, మహ్మద్‌ సోహెల్‌, హేమంత్‌కుమార్‌ అనే నగల వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఓ కారు, రూ.3లక్షల నగదు, హత్యలకు ఉపయోగించిన కత్తి (జమ్మి), మూడు సెల్‌ఫోన్లు, ఐదు తులాలు బంగారం ముద్ద, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ శుక్రవారం రాత్రి విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ, తెలంగాణకాలనీలో ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని ఈ నెల 22న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న నాలుగు మృతదేహాలను చూశారు. మృతులను మహ్మద్‌ సుల్తాన్‌, అతని భార్య హసీనా, కుమారుడు ముజామిల్‌, కుమార్తె అఫ్సారాగా గుర్తించారు. హసీనా అక్క కుమార్తె తబుస్సుం భర్త అయిన సయ్యద్‌ అస్లాం ఈ హత్యలు చేసినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది.


హైదరాబాద్‌లో గండిపేటలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా పని చేసే అస్లాం.. హసీనా వద్ద ఏడాది క్రితం రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో మరో రూ.లక్ష కావాలని హసీనాను అడిగాడు. అప్పటికే వడ్డీ సక్రమంగా చెల్లించడం లేదని, మళ్లీ కొత్త అప్పు ఎందుకిస్తానని హసీనా అతనిని అవమానించింది. పైగా, అప్పును చెల్లించమని ఒత్తిడి పెంచింది. మరోపక్క, హసీనా 2013లో తన మొదటి భర్తపై పెట్టిన కేసులో తబుస్సుం తల్లి తహీరాబేగంను జైలుకు పంపింది. దీంతో హసీనాపై అస్లాం దంపతులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో అస్లాం, తన స్నేహితుడు సోహెల్‌తో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 28న హసీనా ఇంట్లో చోరీకి యత్నించారు. డబ్బు, వస్తువులు దొరక్కపోవడంతో వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో అస్లాం.. ఇంటి గోడలపై కోడి గుడ్లు పగలుగొట్టాడు.


యూట్యూబ్‌ వీడియోలు చూసి...

హసీనాపై కక్ష పెంచుకున్న అస్లాం దంపతులు. హసీనా నల్లగొండలో ఓ ఇల్లు, 10 తులాల బంగారం కొనుగోలు చేసిందని, బ్యాంకులో రూ.2.25లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిందని తెలుసుకొని మరింత రగలిపోయారు. హసీనాను హతమార్చితే ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారం తమదవుతుందని భావించారు. హత్య చేశాక పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు యూట్యూబ్‌ వీడియోలు చూశారు. అనంతరం జూన్‌ 19వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు అస్లాం తన కారులో హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వచ్చాడు. రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తానని హసీనాకు ఫోన్‌లో చెప్పాడు. ఆమె స్పందించకపోవడంతో... సాగర్‌ రోడ్డు శివారులో అర్ధరాత్రి సుమారు 2 గంటల దాకా వేచి ఉన్నాడు. ఆ తర్వాత సుల్తాన్‌ కుటుంబం నివసించే ఇంటి గోడ దూకి ఇంటి ఆవరణలో దాక్కొని సమయం కోసం వేచి ఉన్నాడు.


మంచం కింద దాక్కుంటే లాగి

అనంతరం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో హసీనా ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా అస్లాం కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. దీంతో హసీనా రక్తపుమడుగులో పడిపోగా.. ఆమె కేకలు విని భర్త సుల్తాన్‌ బయటకు వచ్చాడు. తనని చూసి పారిపోయేందుకు యత్నించిన సుల్తాన్‌ను కూడా అస్లాం హతమార్చాడు. ఈ ఘోరాన్ని చూసిన సుల్తాన్‌ దంపతుల కుమారుడు ముజామిల్‌ ఇంట్లో నుంచి పారిపోతుండగా అస్లాం అతడిపైనా దాడి చేశాడు. ఈ క్రమంలో ముజామిల్‌ తన వద్ద ఉన్న ఐరన్‌ సీకుతో ఎదురుదాడి చేయగా అస్లాంకు గాయాలయ్యాయి. కానీ, అస్లాం దాడిలో ముజామిల్‌ కూడా హతమయ్యాడు. ఇక, సుల్తాన్‌ కుమార్తె అఫ్సారా భయంతో పడక గదిలోని మంచం కింద దాక్కోగా... ఆమెను బయటకు లాగి మరీ అస్లాం హతమార్చాడు. అనంతరం ఆరుబయట ఉన్న శవాలను ఎవరూ గుర్తించకూడదని వాటిపై దుప్పట్లు, చాప వేశాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న 5తులాల బంగారు ఆభరణాలు, భూమికి సంబంధించిన పత్రాలను తీసుకొని అస్లాం తన కారులో పారిపోయాడు. దొంగిలించిన నగలను సోహెల్‌ సాయంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ బాలజీ జ్యూయలరీ షాపు నిర్వాహకుడు హేమంత్‌ కుమార్‌ వద్ద కుదువ పెట్టి రూ.5.30లక్షలు తీసుకున్నాడు. అయితే, దర్యాప్తులో అసలు విషయాలను కనుగొన్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - Jun 27 , 2026 | 07:13 AM