ఆస్తి వివాదాలతోనే హత్యలు?
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:46 AM
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతురాలి సొంత కుమార్తె....
హతురాలు హసీనా పేరిట రూ.2కోట్ల ఆస్తులు.. అదుపులో మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె, అల్లుడు
ఆరుగురు వ్యక్తులకు రూ.5లక్షల సుపారీ ఇచ్చి హత్యలు?
కుటుంబంలో నలుగురిపై విచక్షణారహితంగా కత్తిపోట్లు
తేల్చిన పోస్టుమార్టం నివేదిక
పోలీసు దర్యాప్తుతో వీడుతున్న నల్లగొండ హత్యల కేసు మిస్టరీ
నల్లగొండ క్రైం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతురాలి సొంత కుమార్తె, అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ హత్యలకు కారణాలు, నిందితుల వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 19న అర్ధరాత్రి జిల్లా కేంద్రమైన నల్లగొండలో మహమ్మద్ సుల్తాన్, హసీనా, ముజామిల్, అప్సారాలను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. 22న డయల్-100కు వచ్చిన సమాచారంతో హత్యోదంతం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. తెలంగాణ కాలనీకి చెందిన మహమ్మద్ సుల్తాన్‌కు హసీనా రెండో భార్య కాగా, హసీనాకు సుల్తాన్ మూడో భర్త! సుల్తాన్ మొదటి భార్య కుమారుడు ముజామిల్, కుమార్తె అప్సారాతో కలిసి ఉంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హసీనా మొదటి భర్త వారసత్వంగా ఉన్న ఆస్తులను ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. తర్వాత హసీనాకు మొదటి భర్తతో విడాకులవ్వగా ఆమెకు భరణంగా కొంత డబ్బును ఇచ్చారు. ఆ డబ్బుతో ఆమె నల్లగొండలోని సాగర్ రోడ్డులో ఉన్న తెలంగాణ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసింది. మొదటి భర్తతో విడాకుల సమయంలో కొంత సాగు భూమి ఆమె పేరిట ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తమ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నందున ఆ భూమిని తమపేరిట రిజిస్ట్రేషన్ చేయాలని మొదటి భర్త ద్వారా పట్టిన కుమార్తె, అల్లుడు పలుమార్లు హసీనాపై ఒత్తిడిచేసినట్లు, ఇందుకు ఆమె నిరాకరించినట్లు తెలిసింది. ఇటీవల హసీనా కుమార్తె, అల్లుడు, ఇతర వ్యక్తులు మహమ్మద్ సుల్తాన్ కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో సాగు భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలను వెతికినట్లు, వారికి అవి లభించనట్లు తెలిసింది. దీంతో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో ఇదే విషయంపై గొడవపడినట్లు సమాచారం.
సుపారీ గ్యాంగ్ పనేనా?
రూ.2కోట్ల విలువైన భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోగా హాసీనా తన మూడో భర్త అయిన మహమ్మద్ సుల్తాన్ సంతానం ముజామిల్, అప్సారాకు ఆ భూమి చెందేలా వీలునామా రాస్తానని కుమార్తె, అల్లుడికి స్పష్టం చేయడంతో వారు కక్ష పెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తమకు దక్కాల్సిన ఆస్తులను ఇతరులకు ఇస్తామని ఆమె అనడంతోనే ఈ నలుగురిని హత్య చేయాలని ప్రణాళికను రచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హసీనా కుమార్తె, అల్లుడు హైదరాబాద్‌లోని ఆరుగురు వ్యక్తులకు రూ.5లక్షల వరకు సుపారీ ఇచ్చి హత్యలు చేయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా సుల్తాన్ శరీరంపై ఆరు కత్తిపోట్లు, హసీనాపై ఏడు, అప్సారాపై తొమ్మిది కత్తిపోట్లు, ముజిమిల్‌పై 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. నిందితులు ఇంట్లో తమ కుటుంబసభ్యులపై దాడులు చేస్తున్న సమయంలో 11 ఏళ్ల అప్సారా తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకోవడానికి మంచం కింద దాక్కోగా, ఆమెను బయటకు లాగి కత్తులతో పొడిచి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఈ హత్యల సమయంలో కుమార్తె, అల్లుడు కూడా ఘటనా స్థలం పరిసరాల్లో ఉన్నట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పలు సాంకేతిక ఆధారాలతో ఈ కేసును పోలీసులు ఛేదించారు. హసీనా మొదటి భర్త కుమార్తె, అల్లుడితో పాటు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పలువురు నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.