Share News

ఎయిర్‌ఫోర్స్‌ అధికారి భార్యపై అత్యాచారం!

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:56 AM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరంలో దారుణం జరిగింది. వైమానిక దళ అధికారి భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఎయిర్‌ఫోర్స్‌ అధికారి భార్యపై అత్యాచారం!

  • కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి దారుణం

  • ఫొటోలు, వీడియోలతో ఏడాదిగా బ్లాక్‌మెయిల్‌

  • బలవంతంగా డబ్బు వసూలు మతమార్పిడి కూడా..

  • నాగ్‌పూర్‌లో దారుణం

నాగ్‌పూర్‌, జూన్‌ 16: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరంలో దారుణం జరిగింది. వైమానిక దళ అధికారి భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఫొటోలు, వీడియోలతో ఏడాది కాలంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.4 లక్షల వరకూ ఆమె నుంచి వసూలు చేశారు. బలవంతంగా మతమార్పిడికి కూడా ప్రయత్నించారని, తనతో మాంసాహారం కూడా తినిపించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘నన్ను వదలండి’ అని బాధితురాలు వేడుకుంటుండగా ప్రధాన నిందితుడు అయ్యాజ్‌ తాజ్‌ మదారే(26) ఆమె చేతిని పట్టుకొని ఉర్దూలో మంత్రాలు ఉచ్చరించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మూడో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధితురాలు(24) నాగ్‌పూర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉన్న మదారే తన స్నేహితుడికి భూమి కొనుగోలు పేరిట గతేడాది ఆమె వద్దకు వచ్చాడు. 2025 ఫిబ్రవరి 8న ఆమెను వార్దా రోడ్డులోని ఓ హోటల్‌కు ఆహ్వానించాడు. అక్కడ మత్తుపదార్థాలు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఆమెకు ఇచ్చాడు. అది తాగి ఆమె స్పృహ కోల్పోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఆ దారుణాలను ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. తాను చెప్పినట్టు చేయకుంటే ఆ వీడియోలను ఆమె భర్తకు పంపుతానని, సోషల్‌ మీడియాలోనూ పెడతానని బెదిరించాడు. అప్పటి నుంచి పదేపదే ఆమె ఇంటికి వెళ్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో తెచ్చిన డ్రింక్‌ను ఆమెతో తాగించి, ఉర్దూ వాక్యాలను ఆమెతో పలికించేవాడు. వాటిని చేతబడి, వశీకరణ విద్యగా చెప్పేవాడు. మే 31న మదారే, అతని అనుచరుడు అమీన్‌ షేక్‌(30) ఆమెను కమలేశ్వర్‌ ప్రాంతానికి తీసుకెళ్లి హజ్రత్‌ మౌలానాకు పరిచయం చేశారు. అక్కడ నిర్వహించిన సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఆమెతో పదే పదే ‘ఖుబూల్‌ హై’ అనిపించారు. తద్వారా ఆమె ఇస్లాం మతంలోకి మారిపోయినట్టు, మదారేతో ఆమెకు వివాహం జరిగినట్టు మౌలానా ప్రకటించాడు. ఆచారంలో భాగమంటూ తనతో మాంసాహారం కూడా తినిపించారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన భర్తకు ఈ దారుణాలను బాధితురాలు వివరించారు. అనంతరం దంపతులిద్దరూ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మదారే, అమీన్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టగా.. ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించారు. మరో నిందితుడు హజ్రత్‌ మౌలానా పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారం, దోపిడీ, నేరపూరిత బెదిరింపులు, మతమార్పిడి యత్నం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నామని, ఎలక్ర్టానిక్‌ పరికరాలను సీజ్‌ చేసి, ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని జోనల్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ రిషికేశ్‌ రెడ్డి చెప్పారు.

Updated Date - Jun 17 , 2026 | 03:56 AM