వివాహితపై అత్యాచారం.. దారుణ హత్య
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:22 AM
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సమీపంలో ఓ వివాహిత(24) దారుణ హత్యకు గురైంది. ఓ వ్యక్తి ఆ వివాహితపై అత్యాచారం చేసి.. అనంతరం మరో వ్యక్తితో కలిసి ఆమెను చంపి, మృతదేహాన్ని తగులుబెట్టాడు.
ఆపై మృతదేహాన్ని తగలబెట్టిన వ్యక్తి.. మరొకరితో కలిసి కిరాతకం
పోలీసులకు లొంగుబాటు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం
వెల్దండ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సమీపంలో ఓ వివాహిత(24) దారుణ హత్యకు గురైంది. ఓ వ్యక్తి ఆ వివాహితపై అత్యాచారం చేసి.. అనంతరం మరో వ్యక్తితో కలిసి ఆమెను చంపి, మృతదేహాన్ని తగులుబెట్టాడు. ఆపై కిరాతకులు పోలీసులకు లొంగిపోయారు. వెల్దండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (24) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. వివాహిత కల్వకుర్తిలోని ఓ దుకాణంలో పని చేస్తోంది. అయితే, బుధవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరిన వివాహిత.. తనకు పరిచయమున్న, తమ గ్రామానికే చెందిన శ్యాంపురి రాములు ద్విచక్రవాహనం ఎక్కింది. రాములు హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం తన గ్రామానికే చెందిన నాయని శ్రీనును ముందస్తుగా పథకం ప్రకారం అక్కడికి పిలిపించుకున్నాడు. శ్రీను ఆమెను పట్టుకోగా.. రాములు చున్నీతో గొంతు బిగించి ఆ యువతి ప్రాణం తీశాడు. అనంతరం వారిద్దరూ కలిసి కొట్ర గ్రామ సమీపంలోని ఓ ప్రాంతంలో రెండు బండరాళ్ల మధ్య కట్టెలపై యువతి మృతదేహాన్ని ఉంచి డీజిల్‌తో తగులబెట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. మరోపక్క, వివాహిత భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. నిందితులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లగా మృతదేహం కాలి బూడిదైంది. గురువారం క్లూస్‌టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. నిందితులు రాములు, శ్రీనును రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు.