వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:14 PM
ముంబైలో మంగళవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రాత్రి వేళ ఓ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన ఓ ఆగంతుకుడు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో మంగళవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రాత్రి వేళ ఓ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన ఆగంతుకుడు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. కాందీవలీ వెస్ట్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వృద్ధురాలు తన ఫ్లాట్ తలుపు తీస్తుండగా డెలివరీ ఏజెంట్‌లా వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాటకలిపాడు. ఆమెను ఏవో ప్రశ్నలు అడిగాడు. వృద్ధురాలు అతడికి బదులిచ్చారు. ఈ క్రమంలో నిందితుడు అకస్మాత్తుగా ఆమె గొలుసు తెంపుకుని పారిపోయాడు. నిందితుడిని ప్రతిఘటించలేని నిస్సహాయస్థితిలో వృద్ధురాలు షాక్‌కు గురయ్యారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
బయటకు వెళ్లి వచ్చిన వృద్ధురాలు తన ఫ్లాట్ తలుపు తీస్తుండగా నిందితుడు చోరీ చేశాడని పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల వారి గురించి ఏదో అడుగుతూ ఆమెను ఏమార్చే ప్రయత్నం చేశాడని అన్నారు. వృద్ధురాలికి తనపై ఎలాంటి అనుమానం లేదని నిర్ధారించుకున్నాక అకస్మాత్తుగా ఆమె మెడలో గొలుసు తెంపుకుని పారిపోయాడని చెప్పారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రిటైర్డ్ ప్రొఫెసర్‌కు రూ.50 లక్షల టోకరా.. ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం