6 నెలల బిడ్డను ఆరంతస్తుల భవనంపై నుంచి పడేసి..తాను దూకేసిన తల్లి
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:33 AM
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది.
మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అఘాయిత్యం
తల్లి మృతి, సోలార్ ఫెన్సింగ్‌లో చిక్కుకోవడంతో చిన్నారి సురక్షితం
మియాపూర్, జూన్ 12(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల వయస్సు ఉన్న తన కన్నబిడ్డను ఆరంతస్తుల భవనంపై నుంచి పడేసి.. ఆపై తాను కూడా అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఆ తల్లి అక్కడికక్కడే మరణించగా... అదృష్టవసాత్తు సోలార్ ఫెన్సింగ్‌లో చిక్కుకొని ఆ పసికందు ప్రాణాలతో మిగిలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈషా సాహు(37) కాగ్నిజెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త కూడా ఐటీ ఉద్యోగే. మియాపూర్ మయూరినగర్‌లో నివాసముంటున్న ఈషా దంపతులకు విధి(8), వాణి(6 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, 11 ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈషా రెండో బిడ్డ పుట్టిన తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి ఈషా తన ఆరు నెలల బిడ్డ వాణిని కిందకు పడేసింది. ఆపై, ఈషా కూడా కిందకు దూకేసింది. దీంతో ఈషా అక్కడికక్కడే మరణించగా.. సోలార్ ఫెన్సింగ్‌లో చిక్కుకున్న చిన్నారి వాణి స్పల్ప గాయాలతో బయట పడింది.