Share News

బాలికపై హత్యాచారం కేసులో నిందితుడి తల్లిపైనా కేసు నమోదు

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:02 AM

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్‌తోపాటు అతడి తల్లి అంజనమ్మపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలికపై హత్యాచారం కేసులో నిందితుడి తల్లిపైనా కేసు నమోదు

  • కొడుకు అఘాయిత్యం చేసిన విషయం తెలిసే.. పారిపోయినట్లు అనుమానం

  • మున్సిపాలిటీకి కులవర్ధన్‌ మృతదేహం అప్పగింత

అన్నమయ్య/మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్‌తోపాటు అతడి తల్లి అంజనమ్మపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు కులవర్ధన్‌ ఇప్పటికే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడం, ఆ తర్వాత నీటి డ్రమ్ములో ముంచడం అతని తల్లికి తెలుసునని పేర్కొంటూ మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో అంజనమ్మను రెండో నిందితురాలిగా చేర్చారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి బాలిక కనిపించలేదు. అప్పటికి అంజనమ్మ ఇంటి వద్దే ఉంది. సాయంత్రం 5 గంటలపైన బాలిక అవ్వాతాతలు ఆమె కనిపించడం లేదనే విషయాన్ని గుర్తించారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటివరకు ఇంటి వద్దే ఉన్న అంజనమ్మ.. ఆ తర్వాత కనిపించలేదు. బాలికను తన కొడుకు ఇంట్లోకి పిలిచి అఘాయిత్యం చేసిన విషయం తెలిసే.. ఆమె బెంగళూరుకు వెళ్లిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

చెత్తబండిలో కులవర్ధన్‌ మృతదేహం తరలింపు

చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కులవర్ధన్‌ ఆత్మహత్య తర్వాత.. అంత్యక్రియలు నిర్వహించేందుకు చివరికి కుటుంబసభ్యులు సహా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మదనపల్లె మున్సిపల్‌ అధికారులకు లేఖ రాశారు. మున్సిపల్‌ కార్మికులు గురువారం సాయంత్రం మదనపల్లె ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉన్న కులవర్ధన్‌ మృతదేహాన్ని చెత్తబండిలో వేసుకుని, పట్టణ శివారులోని డంపింగ్‌ యార్డుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు కులవర్ధన్‌ మృతదేహం వద్దని చెప్పడంతో.. 24 గంటలకు పైగా అది మార్చురీకే పరిమితం అయ్యింది.

రాస్తారోకోపై నాలుగు కేసులు

బాలికపై హత్యాచారం నేపథ్యంలో జరిగిన రాస్తారోకోపై మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో రెండు, టూటౌన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. మదనపల్లె నియోజకవర్గ వైసీపీ కన్వీనర్‌ నిస్సార్‌ అహ్మద్‌తోపాటు 40 మంది పేర్లు చేర్చారు. అన్నమయ్య సర్కిల్‌, నీరుగట్టువారిపల్లె కాట్లాటవారిపల్లె జంక్షన్‌లో ఆందోళన సమయంలో విధులకు ఆటంకం కలిగించారని, పక్కకు తోసేశారని, రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారన్న పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

Updated Date - Feb 20 , 2026 | 03:02 AM