నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో తల్లి దాడి
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:56 AM
మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి తన కన్న పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
కుమార్తె మృతి, కుమారుడికి గాయాలు
తల్లి ఆత్మహత్యాయత్నం.. మానసిక స్థితి సరిగా లేక ఘాతుకం
భువనగిరిరూరల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి తన కన్న పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండ లం తుక్కాపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన గురిం చి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేందర్‌రెడ్డి, నీలిమ దంపతులకు కుమార్తె కృతిరెడ్డి(14), కుమారుడు అక్షిత్‌రెడ్డి(14) ఉన్నారు. నీలిమకు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేక పిల్లలను క్రమశిక్షణ పేరుతో తరచూ ఇబ్బందులకు గురిచేసేది. శనివారం తనను, పిల్లలను పుట్టింటి వద్ద వదిలిపెట్టాలని నీలిమ కోరడంతో, భర్త నరేందర్‌రెడ్డి వారిని తుక్కాపురంలోని అత్తగారింటి వద్ద వదిలివెళ్లాడు. ఆరోజు రాత్రి తల్లిదండ్రులు ఒక గదిలో, నీలిమ తన ఇద్దరు పిల్లలతో మరో గదిలో నిద్రించారు. తెల్లవారుజామున మనుమడు అక్షిత్‌రెడ్డి కేకలు వేయటంతో నీలిమ తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. లోపలికి వెళ్లి చూడగా నిద్రిస్తున్న మనుమరాలు కృతిరెడ్డి మెడకు రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందినట్లు గుర్తించారు. మనుమడు అక్షిత్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, నిద్రలో నుంచి మేల్కొని తల్లితో పెనుగులాడి తప్పించుకున్నట్లు గమనించారు. ఈ ఘటనలో అక్షిత్‌రెడ్డి మెడ, భుజం, అరచేతిపై కత్తిగాట్లు పడ్డాయి. పిల్లలపై దాడికి పాల్పడిన తల్లి నీలిమ అనంతరం ఉరి వేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.