Share News

ఎంతపని చేశావమ్మా!

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:03 AM

నేను చెప్పేది వినండి. ఈ గుళికలు మింగితే ఆరోగ్యం బాగుంటుంది’ అని పిల్లలకు నచ్చజెప్పి విషపు గుళికలు మింగించింది ఆ తల్లి. ఆ తర్వాత తానూ మింగింది.

ఎంతపని చేశావమ్మా!

  • బిడ్డలకు విషపు గుళికలిచ్చి.. తానూ మింగిన తల్లి

  • తల్లి, కుమారుడు మృతి.. కుమార్తె పరిస్థితి విషమం

  • అప్పులోళ్ల ఒత్తిడే కారణమంటున్న పోలీసులు.. శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన

హిందూపురం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘నేను చెప్పేది వినండి. ఈ గుళికలు మింగితే ఆరోగ్యం బాగుంటుంది’ అని పిల్లలకు నచ్చజెప్పి విషపు గుళికలు మింగించింది ఆ తల్లి. ఆ తర్వాత తానూ మింగింది. ఈ విషయం వైద్యులకు తెలిసేలోగా తల్లి, కుమారుడు మృతి చెందారు. కూతురు పరిస్థితి విషమంగా ఉంది. అప్పులోళ్ల ఒత్తిడి భరించలేకే ఆ తల్లి ఈ పని చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం ఎం.బీరేపల్లిలో ఈ ఘటన జరిగింది. హిందూపురం అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌ కథనం మేరకు.. ఎం.బీరేపల్లికి చెందిన ముద్దప్ప, మహాలక్ష్మి(33) దంపతులు గంధోడి(పసుపు, కుంకుమ తదితరాల) వ్యాపారం చేస్తుంటారు. మహాలక్ష్మి కొంతకాలం కిందట ఇతరుల రుణం తీసుకుని చెల్లించలేకపోవడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో దిక్కుతోచక సోమవారం మధ్యాహ్నం ఆమె కూతురు శ్రీనిధి(14), కుమారుడు రిషిత్‌(12)లకు బియ్యం పిండిలో విషపు గుళికలు కలిపి మింగించారు. కొంతసేపటికి భర్త ముద్దప్ప ఇంటికి వచ్చి ఏమైందని ప్రశ్నించగా నిమ్మరసం తాగామని అబద్ధ చెప్పారు. హిందూపురం ప్రభుత్వాస్పపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా.. మంగళవారం రిషిత్‌ మృతి చెందాడు. మహాలక్ష్మిని అనంతపురం తరలిస్తుండగా ఆమె కూడా మృతి చెందారు. కాస్త మెలకువగా ఉన్న శ్రీనిధిని ఆరా ఆరా తీయగా.. తాము నిమ్మరసం తాగలేదని, బియ్యపు పిండిలో గుళికలు పెట్టుకుని మింగామని శ్రీనిధి చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనిధి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లి ఉద్దేశపూర్వకంగానే బిడ్డలకు విషమిచ్చి, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నచిన్న మొత్తాల్లో సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు ఉంటాయన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 05:03 AM