Share News

కళ్లలో కారం కొట్టి..మెడకు చున్నీ బిగించి..

ABN , Publish Date - May 18 , 2026 | 03:34 AM

భూవివాదంతో సమీప బంధువులపై ఐదేళ్లుగా న్యాయపోరాటం చేసిన ఆ తల్లీకుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వీరి కళ్లల్లో కారంకొట్టి చున్నీలతో గొంతు బిగించి ఉసురు తీశారు.

కళ్లలో కారం కొట్టి..మెడకు చున్నీ బిగించి..

  • తల్లీకుమార్తెల దారుణ హత్య

  • సమీప బంధువులతో ఐదేళ్లుగా ఆస్తి వివాదం

హాలియా, మే 17 (ఆంధ్రజ్యోతి): భూవివాదంతో సమీప బంధువులపై ఐదేళ్లుగా న్యాయపోరాటం చేసిన ఆ తల్లీకుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వీరి కళ్లల్లో కారంకొట్టి చున్నీలతో గొంతు బిగించి ఉసురు తీశారు. ఆదివారం నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్ష యాదయ్యకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. యాదయ్య 16ఏళ్ల క్రితం మృతిచెందగా అతని భార్య సుమలత (40), కుమార్తె లావణ్య(20) వ్యవసాయాన్ని ఉపాధిగా చేసుకున్నారు. సుమలత తనకు పుట్టింటి వారిచ్చిన మూడెకరాలతో పాటు, భర్త పేరిట ఉన్న పొలాలను సాగు చేసుకుంటున్నారు. గతంలో యాదయ్య ఆస్తి వివాదం పరిష్కారంలో భాగంగా పంచాయితీ పెద్దల నిర్ణయం మేరకు తన అక్కాచెల్లెళ్లకు తలా ఒక ఎకరం ఇచ్చాడు. అనంతరం యాదయ్య కుటుంబానికి గ్రామంలో ఎనిమిదెకరాల పొలం ఉంది. అందులోనూ తమకు వాటా వస్తుందని ఆడపడుచులు పంచాయితీ పెట్టటంతో తమకు న్యాయం చేయాలని తల్లీకుమార్తెలు కోర్టుకు వెళ్లారు. వీరికి అనుకూలంగా తీర్పు రావడం, కుమార్తె లావణ్య మేజర్‌ కావడంతో 8 ఎకరాల పొలాన్ని ఆమె పేరిట సుమలత పట్టా చేయించింది. ఆపై కుమార్తెకు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో సమీప బంధువులతో కొంతకాలంగా వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పటినుంచి వారివల్ల ప్రాణభయం ఉందని గమనించిన కుమార్తె లావణ్య తల్లి వెంటే ఉంటోంది.. ఆదివారం ఉదయం తల్లీకుమార్తె తమ పామాయిల్‌ తోటకు వెళుతుండగా... వారి సమీప బంధువులు సైతం వెనుకే వెళ్లటాన్ని స్థానికులు గుర్తించారు. కొంత సమయానికి బంధువులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం అనుమానించిన స్థానికులు తోటలోకి వెళ్లి చూడగా, తల్లీకుమార్తెలు విగతజీవులుగా పడిఉండటాన్ని గుర్తించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. కాగా లావణ్య రాజేంద్రనగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసింది. బంధువుల నుంచి ప్రాణహాని ఉండడంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తల్లితో పాటే ఉంటోంది.

Updated Date - May 18 , 2026 | 03:34 AM