వరకట్న వేధింపులకు తల్లీకొడుకు బలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:53 AM
వరకట్న వేధింపులు తాళలేక ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకొడుకుల మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి.
ఎస్సారెస్పీ కాలువలో లభ్యమైన మృతదేహాలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన
వర్ధన్నపేట రూరల్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వరకట్న వేధింపులు తాళలేక ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకొడుకుల మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామానికి చెందిన కామిండ్ల కళ్యాణి, ఆమె మూడేళ్ల కుమారుడు శ్రేయాన్ష్‌తో కలిసి శనివారం కాలువలో దూకగా, దాదాపు 24 గంటల తర్వాత వారి మృతదేహాలు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం నుంచే పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీం బోట్ల సాయంతో గాలింపు చేపట్టారు. ఏడు గంటల శ్రమ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇల్లంద గ్రామ శివారులో మృతదేహలు నీటిపై తేలుతూ కనిపించాయి. మృతదేహాలను బోటులోకి ఎక్కిస్తున్న తరుణంలో కళ్యాణి తన కుమారుడు శ్రేయాన్ష్‌ను చున్నీతో నడుముకు కట్టుకుని ఉండడం అందరినీ కలచివేసింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులకు కారణమైన భర్త కామిండ్ల హరీష్, అతడి సోదరి బెల్లం రాధిక, బావ రాజులపై పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.