Share News

మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగపై పోలీసుల కాల్పులు

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:25 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగను నల్లగొండ జిల్లా పోలీసులు సాహసోపేతంగా అరెస్టు చేశారు.

మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగపై పోలీసుల కాల్పులు

  • తొడపై కాల్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ఆదిభట్ల వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘటన

  • ఏపీలోని నరసాపురానికి చెందిన నిందితుడు

  • డీసీఎంలో హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా.. ఆపి తనిఖీ చేసిన నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు

  • ఇనుపరాడ్‌తో పోలీసులపై నిందితుడి దాడి

  • హెడ్‌ కానిస్టేబుల్‌ గాయపడడంతో కాల్పులు

  • నిందితుడిపై హత్యకేసు సహా 100కు పైగా కేసులు

నల్లగొండ క్రైం/ఆదిభట్ల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగను నల్లగొండ జిల్లా పోలీసులు సాహసోపేతంగా అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అతడు ఇనుపరాడ్‌, కత్తితో పోలీసులపై దాడి చేయడంతో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం తొలుత గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించారు. అయినా నిందితుడు దాడి ఆపకపోవడంతో.. అతని తొడపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిఽధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, మరోవైపు ఆదిభట్ల సీఐ రవికుమార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ భీమవరం నరసాపురానికి చెందిన భూష్మి శ్రీకాంత్‌ తెలుగు రాష్ట్రాల్లో 100పైగా దొంగతనాలు చేశాడు. 2007లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ మర్డర్‌ కేసులో ఎ2గా ఉండి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతనికి ఏపీలోని పిడుగురాళ్ల తుమ్మలచెరువుకు చెందిన అలంశెట్టి సాయికిరణ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి 2024, 2025లో మిర్యాలగూడ, మిర్యాలగూడ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో 70 తులాల బంగారం దొంగిలించారు. దాంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. క్లూస్‌ టీం ద్వారా ఇద్దరి వేలిముద్రలను సేకరించిన నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు.. వాటి ఆధారంగా సాయికిరణ్‌ను మంగళవారం పిడుగురాళ్ల వద్ద అదుపులోకి తీసుకొని విచారించారు.


పోలీసులపై నిందితుడి దాడి..

సాయికిరణ్‌ ద్వారా శ్రీకాంత్‌ ఫోన్‌ నంబర్‌ తెలుసుకున్న నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు.. ఫోన్‌ను ట్రేస్‌ చేసి అతడు డీసీఎంలో హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డ వద్ద డీసీఎంను ఆపి తనిఖీ చేస్తుండగా నిందితుడు శ్రీకాంత్‌ వాహనం నుంచి కిందికి దిగి ఇనుపరాడ్‌తో హెడ్‌ కానిస్టేబుల్‌ తలపై దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ విష్ణువర్ధన్‌ గిరి తుపాకీతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా నిందితుడు ఆగకుండా కత్తితో దాడి చేయడం మొదలు పెట్టడంతో పోలీసులు నాలుగో బుల్లెట్‌ను అతని ఎడమ తొడపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో గాయపడ్డ హెడ్‌ కానిస్టేబుల్‌ను, నిందితుడు శ్రీకాంత్‌ను ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం శ్రీకాంత్‌ను నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు డీసీఎం డ్రైవర్‌, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం అంజనీపురానికి చెందిన వేల్పుల అతేంద్రను కూడా అరెస్టు చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ విష్ణువర్ధన్‌ గిరి, ఎస్సై విజయ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆదిభట్ల సీఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 04:25 AM