Share News

ఆమెకు రుణమిస్తే మరణమే!

ABN , Publish Date - May 19 , 2026 | 04:46 AM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ జంట హత్యల కేసు నిందితురాలిని పోలీసులు విచారించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమెకు రుణమిస్తే మరణమే!

  • మొయినాబాద్‌ జంట హత్యల కేసు నిందితురాలి తీరిది

  • అప్పు ఇచ్చిన మిగతా ఆరుగురినీ చంపేందుకు ప్లాన్‌

  • పోలీసులకు పట్టుబడకుంటే అదేరోజు మరో హత్యకు స్కెచ్‌

  • ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు

  • నిందితురాలి వాంగ్మూలం రికార్డు.. నిలకడగా ఆమె ఆరోగ్యం

తాండూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ జంట హత్యల కేసు నిందితురాలిని పోలీసులు విచారించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు అప్పు ఇచ్చిన మొత్తం 8 మందిని నిందితురాలు కరీమాబీ తన ప్రియుడు, మరొకరితో కలిసి చంపేందుకు ప్లాన్‌ వేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యకు ప్లాన్‌ చేసిన 8 మందిలో ఇద్దరు మహిళలను చం పగా.. మరో ఆరుగురిని కూడా ఫాంహౌ్‌సకు పిలిచింది. అయితే వారు అక్కడికి రాకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.. నిందితురాలు కరీమాబీ పదేళ్ల కిందే భర్తతో విడిపోయింది. ఆమె సహజీవన ప్రియుడు రెహమాన్‌తో కలిసి తాండూరు పట్టణంలోని ఇందిరమ్మకాలనీలో ఉండేది. బట్టల వ్యాపారం చేసే కరీమాబీకి నష్టాలు రావడంతో ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద అప్పులు తీసుకోని జీవనం కొనసాగిస్తుండేది. ఇంద్రానగర్‌, సాయిపూర్‌, ఇందిరమ్మ కాలనీల్లో పలువురి వద్ద అప్పులు చేసి తిరిగి చెల్లించకుండా.. వారినే చంపేందుకు ప్లాన్‌ వేసింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ బేగంను మొదట మొయినాబాద్‌ ఫాంహౌ్‌సకు రప్పించి ప్రియుడు రెహమాన్‌, అక్కడ సెక్యూరిటీగా పనిచేసే నయీంతో కలిసి గొంతునులిమి హత్య చేసి గోతిలో పాతి పెట్టింది. ఆ తర్వాత బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌ అంగన్‌వాడీ ఆయా ఆబేదా బేగంను అలాగే చంపి పాతిపెట్టింది. రెండు నెలల వ్యవధిలో ఈ రెండు హత్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే వారి కాల్‌ డేటా ఆధారంగా కరన్‌కోట్‌ పోలీసులు కేసును చేధించారు. నిందితురాలు కరీమాబీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టయిన రోజే అప్పు ఇచ్చిన మరో మహిళ ను చంపేందుకు కరీమాబీ ప్లాన్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే కరీమాబీ నుంచి ప్రాణహాని ఉందని ఆమెకు అప్పు ఇచ్చిన ఆరుగురు మహిళలు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. తమ బంధువు ఫాంహౌస్‌ వద్ద ఉన్నాడని అక్కడ డబ్బులిస్తాడని తమను కూడా పిలిచిందని బాధితులు పోలీసులకు తెలిపారు. అరెస్టు చేసిన తర్వాత కరీమాబీని కరన్‌కోట్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించగా.. టాయిలెట్‌ వస్తుందని బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆమె అక్కడే ఉన్న యాసిడ్‌ను తాగగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందతున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె వాంగ్మూలం కూడా రికార్డు చేశామని పోలీసులు తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 04:46 AM