ఆ ముగ్గుర్నీ చంపింది శిరీష్ కుమారే
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:42 AM
ఆ ముగ్గురిది హత్యేనని.. శిరీష్ కుమారే నిందితుడని తేలింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్‌వాడలో ఈనెల 5న ఇంట్లో నిప్పంటుకొని ముగ్గురు మరణించడం ప్రమాదవశాత్తు జరగలేదని..
భార్యపై కోపంతోనే ఘాతుకం.. నిందితుడి రిమాండ్
నల్లగొండ క్రైం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఆ ముగ్గురిది హత్యేనని.. శిరీష్ కుమారే నిందితుడని తేలింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్‌వాడలో ఈనెల 5న ఇంట్లో నిప్పంటుకొని ముగ్గురు మరణించడం ప్రమాదవశాత్తు జరగలేదని.. అది శిరీశ్ పనేనని పోలీసులు తేల్చారు. నల్లగొండలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊలేపాలెం గ్రామానికి చెందిన కాళహస్తి శిరీష్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు గతంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు, మోసాలకు పాల్పడ్డాడు. వివాహ వెబ్‌సైట్ల ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం శిరీశ్‌కు అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న మిర్యాలగూడకు చెందిన నక్క ధనలక్ష్మితో అతడు పరిచయం ఏర్పరుచుకొని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో ధనలక్ష్మి అతడిని దూరం పెట్టింది. అదే సమయంలో హాజీపూర్‌లో ఒక మహిళను మోసం చేసిన కేసులో శిరీష్ జైలుకు వెళ్లగా, ఆ సమయంలో తనకు బెయిల్ ఇప్పించేందుకు ధనలక్ష్మి ప్రయత్నించకపోవడంతో శిరీష్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ధనలక్ష్మి కోసం సొంత ఆస్తులను విక్రయించి మిర్యాలగూడలో ఇల్లు కట్టిస్తే ఆమె తనకు మద్దతు ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ధనలక్ష్మిని, ఆమె పిల్లలను హత్య చేయాలని శిరీష్ పథకం వేశాడు. ఘటన జరిగిన రోజు అంతా నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్నాక ఇంట్లోకి ప్రవేశించాడు. తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంట్లో నిద్రిస్తున్న ధనలక్ష్మి తల్లి వనం చంద్రమ్మ(48), ధనలక్ష్మి కుమారుడు లక్ష్మణ్ (17), కుమార్తె ప్రణతి(15)పై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో వారు సజీవదహనమయ్యారు. అక్క డి నుంచి అతడు పరారయ్యాడు. బాధితురాలు ధనలక్ష్మి ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకుంది. కాగా ఘటన తర్వాత నిందితుడు పరారైన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.