ప్రియుడి చేతిలో బాలిక దారుణ హత్య
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:41 AM
ప్రియుడి చేతిలో ఒడిసాకు చెందన ఓ బాలిక దారుణ హత్యకు గురయ్యింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. ఒడిసాలోని బోలంగిరి జిల్లా...
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన
మిర్యాలగూడ అర్బన్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రియుడి చేతిలో ఒడిసాకు చెందన ఓ బాలిక దారుణ హత్యకు గురయ్యింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. ఒడిసాలోని బోలంగిరి జిల్లా, బొంగుముంద గ్రామానికి చెందిన దంపతులు మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. ఈ దంపతుల కుమార్తె (17)కు వారి స్వగ్రామానికి చెందిన తబిరామ్ అనే యువకుడితో పరిచయమైంది. ఒడిసాలో ఉండగానే వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. మూడు నెలల అనంతరం తల్లిదండ్రులు కుమార్తె ఆచూకీ తెలుసుకుని ఆమె ను గత ఏడాది నవంబరులో గూడూరులోని తమవద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో తబిరామ్‌తో పెళ్లిచేస్తే కలిసి జీవిస్తామంటూ తల్లిదండ్రులకు కుమార్తె నచ్చజెప్పి ఒప్పించింది. తబిరామ్ ఇక్కడికి వస్తే అతని ప్రవర్తన, పనితీరును గమనించి వివాహం చేస్తామని తల్లిదండ్రులు చెప్పారు. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తబిరామ్.. స్థానిక ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తాగి వచ్చిన తబిరామ్‌ను బాలిక మందలించింది. తల్లిదండ్రుల షరతు ఉల్లంఘిస్తే తమ పెళ్లి ఎలా జరుతుందని నిలదీసింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న తబిరామ్ బాలిక తలపై ఇటుకతో బాది, ఆ తరువాత చున్నీని మెడకు చుట్టి హత్య చేసి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పీఎన్డీ ప్రసాద్ తెలిపారు.