ఆ ముగ్గురిది హత్యే?
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:50 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ మహిళ, ఆమె మనుమడు, మనుమరాలు ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా మంటల్లో చిక్కుకొని దుర్మరణంపాలయ్యారు.
మిర్యాలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో కొత్త మలుపు
మిర్యాలగూడ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ మహిళ, ఆమె మనుమడు, మనుమరాలు ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా మంటల్లో చిక్కుకొని దుర్మరణంపాలయ్యారు. ఆ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడంతో ప్రమాదవశాత్తు వారు మృతిచెందారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ ముగ్గురూ ప్రమాదంలో మృతిచెందలేదని, వీరిని ఓ వ్యక్తి పథకం ప్రకారం హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. మిర్యాలగూడలోని కలాల్‌వాడలో ఈనెల 5 తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఇంట్లో గ్యాస్‌బండ పేలి మంటలు వ్యాపించాయి. ఇంట్లో నిద్రిస్తున్న చంద్రమ్మ, ఆమె మనుమడు లక్ష్మణ్ (16), మనుమరాలు ప్రణతి (14) మంటల్లో సజీవదహనమయ్యారు. చంద్రమ్మ కుమార్తె.. లక్ష్మణ్, ప్రణతి తల్లి అయిన ధనమ్మ పుణెలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది ఆమెను పోలీసులు రప్పించి మృతదేహాలకు పోస్టుమారం నిర్వహించి.. ఘటనపై కేసు నమోదు చేశారు. ధనమ్మ భర్త కొన్నాళ్లక్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కొద్దిరోజులకు శిరీశ్ కుమార్ అనే ఓ కారు డ్రైవర్‌తో ధనమ్మకు పరిచయమేర్పడింది. ఇద్దరూ సింగరాయకొండలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. తర్వాత కలాల్‌వాడ కాలనీలో రెండు గదుల ఇంటిని కట్టుకొని అక్కడే ధనమ్మ-శిరీశ్ నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటిని పూర్తిగా తన డబ్బుతోనే కట్టానని శిరీశ్ కుమార్ ధనమ్మతో గొడవపడటంతో ఆమె అతడికి దూరంగా పుణెలో ఉంటోంది. ధనమ్మపై కక్ష పెంచుకున్న శిరీశ్ కుమా ర్.. పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతోనే ఇంట్లో గ్యాస్ బండ పేలినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శిరీశ్‌ను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.