హత్య.. ప్రతీకార హత్య!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:30 AM
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ హత్య జరగడం...
గంటల వ్యవధిలో రెండు ప్రాణాలు బలి
యువకుడిని ఆటోతో ఢీకొట్టి చంపిన మరో యువకుడు
ఆగ్రహంతో ఊగిపోయిన మృతుడి బంధువులు
నిందితుడి తండ్రిని రాయితో కొట్టి చంపిన వైనం
మెదక్ జిల్లా సూరారం గ్రామంలో ఘటనలు
చిన్నశంకరంపేట/నర్సాపూర్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ హత్య జరగడం, కొన్ని గంటల్లోనే ప్రతీకార హత్య జరగడంతో గ్రామ ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్‌కు, అదే గ్రామానికి చెందిన రణబోయిన ప్రభాకర్‌కు మధ్య ఓ ఆటో విషయంలో పాత కక్షలున్నాయి. గతంలో పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. సోమవారం బైక్‌పై మరొకరితో కలిసి వెళుతున్న శ్రీధర్‌ను ప్రభాకర్ తన ఆటోతో వెనుక నుంచి ఢీకొట్టాడు. శ్రీధర్ బైక్ మీద నుంచి కింద పడగానే తన అనుచరులతో కలిసి పెద్ద బండరాయి మీద పడేసి హత్య చేశాడు. శ్రీధర్ హత్యతో అతడి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని నేరుగా నిందితుడి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, ఇతర పోలీసులు అధికారులొచ్చి వారికి నచ్చజెప్పారు. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూరారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే అదేరోజు అర్ధరాత్రి నిందితుడు ప్రభాకర్ తండ్రి యాదగిరి మాసాయిపేట మండలం హకీంపేట శివారులో శ్రీధర్ బంధువులకు కనిపించాడు. దీంతో వారు అతడిపై దాడి చేసి, బండరాయితో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని హల్దీ వాగు డ్యామ్‌లో పడేసి వెళ్లిపోయారు. అయితే అప్పటికే యాదగిరితో ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవ్వరూ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని గ్రామస్థులను డీఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు.