మెదక్ జిల్లాలో యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:38 AM
తన ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాడనే కారణంతో పాటు పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని మరో యువకుడు అతడి స్నేహితులు దారుణంగా హత్య చేశారు.
చేగుంట, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తన ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాడనే కారణంతో పాటు పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని మరో యువకుడు అతడి స్నేహితులు దారుణంగా హత్య చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన రణబోయిన ప్రభాకర్, యాట శ్రీధర్ (25)కు మధ్య ఆటో విషయంలో గతంలో గొడవలు జరిగాయి. శ్రీధర్‌పై ప్రభాకర్ కత్తితో దాడి చేయగా, అప్పట్లో పోలీసు కేసు నమోదయింది. ప్రభాకర్ 15 రోజుల క్రితం శ్రీధర్‌కు వరసకు చెల్లెలు అయ్యే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఈ వివాహాన్ని శ్రీధర్ వ్యతిరేకిస్తున్నాడు. దీంతో శ్రీధర్‌ను అడ్డుతొలగించుకోవాలని ప్రభాకర్ భావించాడు. సోమవారం సాయంత్రం మరొకరితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న శ్రీధర్‌ను ప్రభాకర్, అతడి స్నేహితులు రెండు ఆటోల్లో వెంబడించి అనంతసాగర్ గ్రామంలో ఢీకొట్టారు. కిందపడిన శ్రీధర్‌ను అందరూ చూస్తుండగానే కాళ్లతో తొక్కి చంపేశారు. శ్రీధర్‌కు భార్య శ్యామల, రెండు నెలల పాప ఉన్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా.. మృతుడి బంధువులు అడ్డుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.