పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం!
ABN , Publish Date - May 13 , 2026 | 03:55 AM
కంచె చేను మేసిందన్న చందంగా తాను పనిచేసే బ్యాంకునే మోసం చేశాడో మేనేజర్! నకిలీ బంగారం కుదువ పెట్టి రుణాలు తీసుకోవడంతో పాటు ఏటీఎంలో పెట్టాల్సిన ...
రూ.1.79 కోట్లు కొట్టేసిన మేనేజర్
భార్య, స్నేహితులతో కలిసి నకిలీ బంగారంపై రుణాలు
ఏటీఎంలో పెట్టే నగదు స్వాహా
ముగ్గురి అరెస్ట్.. పరారీలో మేనేజర్
మెదక్ అర్బన్, మే 12 (ఆంధ్రజ్యోతి): కంచె చేను మేసిందన్న చందంగా తాను పనిచేసే బ్యాంకునే మోసం చేశాడో మేనేజర్! నకిలీ బంగారం కుదువ పెట్టి రుణాలు తీసుకోవడంతో పాటు ఏటీఎంలో పెట్టాల్సిన నగదును లక్షల్లో మాయం చేశాడు. మొత్తంగా రూ.1.79 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ ప్రైవేట్ బ్యాంకు మెదక్ బ్రాంచ్ మేనేజర్ యాదం అనిల్ మోసాలను డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్ విలేకరులకు తెలిపారు. అనిల్ తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం భార్య ఆధార్, పాన్ కార్డులతో నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నారు. అదే బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసే శ్రీనివా్‌సచారి ఆ బంగారాన్ని తనిఖీచేసి, అసలైనదని చెప్పి, బ్యాంకును మోసం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇలా సుమారు రూ.కోటీ 47 లక్షలకు పైగా తీసుకున్న రుణంలో వాటాలు పంచుకున్నారు. పట్టణంలో ఆ బ్యాంకు ఏటీఎంలు రెండు ఉండగా.. వాటిలో నగదు పెట్టే సమయంలో సుమారు రూ.31.35 లక్షలు మాయం చేశారు. ఇటీవల జరిగిన ఆడిట్‌లో ఈ మోసాలు బయటపడటంతో బ్యాంకు సీఈవో మన్నె వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుబ్రహ్మణ్యం, శ్రీనివా్‌సచారి, స్రవంతిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడైన అనిల్ పరారీలో ఉన్నాడు. అనిల్ గతంలో ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో పోలవరం నిర్వాసితులు, గిరిజనులను మోసంచేసి రూ.11,82,487 వాడుకొన్న కేసులో జైలుకి వెళ్లి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.