3 కోట్లకు బీమా చేయించి భర్తను చంపించిన భార్య!
ABN , Publish Date - May 27 , 2026 | 05:34 AM
వివాహేతర సంబంధం కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.. పనిలో పనిగా డబ్బులూ కలిసి వస్తాయని భావించింది.. రూ.3 కోట్లకు బీమా పాలసీలు చేయించింది..
10 లక్షలు సుపారీ ఇచ్చి హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
బీమా సొమ్ము కోసం దారుణం
వివాహేతర సంబంధమూ కారణమే..
నలుగురు అరెస్టు.. ఇన్సూరెన్స్ పత్రాలు స్వాధీనం
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో ఘటన
మంచిర్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.. పనిలో పనిగా డబ్బులూ కలిసి వస్తాయని భావించింది.. రూ.3 కోట్లకు బీమా పాలసీలు చేయించింది.. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇద్దరితో రూ.10లక్షలు సుపారీ మాట్లాడుకుని భర్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో బాగోతమంతా బయటపడిపోయింది. మంచిర్యాల డీఎస్పీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం వెల్లడించిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో సాయిని కుమార్ (40), ఆయన భార్య భారతి నివసిస్తున్నారు. భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉంది. దీనికి సంబంధించి తరచూ గొడవలు జరుగుండటంతో.. కుమార్‌ను హత్య చేయించాలని భారతి నిర్ణయించింది. ప్రియుడు సురేందర్‌తో కలిసి పథకం వేసింది. వారు సాయిని కుమార్ పేరిట ఏడాది క్రితం రూ.3 కోట్ల మేర జీవిత బీమా పాలసీలు చేయించారు. గతంలో డబ్బుల విషయంలో కుమార్‌కు, రామ్ మల్లేశ్ అనే వ్యక్తికి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో.. కుమార్‌ను అడ్డు తొలగించుకునేందుకు మల్లేశ్‌ను సంప్రదించారు. రూ.10 లక్షలు ఇచ్చేందుకు సుపారీ మాట్లాడుకున్నారు. ఏప్రిల్‌లో రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. మల్లేశ్ తన స్నేహితుడు శ్రీరామ్‌కుమార్‌తో కలిసి హత్యకు ప్రణాళిక వేశాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 22న మద్యం తాగుదామంటూ సాయిని కుమార్‌ను సమీపంలోని ముల్కల్ల గ్రామ శివారుకు తీసుకెళ్లారు. సాయిని కుమార్ మద్యం మత్తులో ఉండగా.. ఇనుప సుత్తెతో తలపై మోది హత్య చేశారు. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సాయిని కుమార్ మృతదేహాన్ని, ఆయన బైక్‌ను రోడ్డుపై పెట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సాయిని కుమార్ హత్యగా గుర్తించారు. నిందితులు రామ్ మల్లేశ్, శ్రీరామ్‌కుమార్, సాయిని భారతి, లగిశెట్టి సురేందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన సుత్తి, రూ.25వేలు నగదు, ఓ ద్విచక్ర వాహనం, ఎల్‌ఐసీ ఎండోమెంట్, జీవన్‌లాభ్, జనరల్ బీమా పాలసీలు, ఎస్‌బీఐ టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.