తుపాకీతో భార్యను కాల్చి చంపిన భర్త
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:09 AM
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
అనుమానంతోనే ఘాతుకం
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
నేరేడ్‌మెట్/హైదరాబాద్ సిటీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మల్కాజిగిరిలోని మారుతినగర్‌లో నివాసం ఉండే అరుణ్‌కుమార్ (49)కు స్వర్ణలతతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల క్రితం మొదటి భార్యకు క్యాన్సర్ ఉందని తెలిశాక.. అతడు ఆమెను దూరంగా పె ట్టాడు. ఆమె చెల్లెలు నిషారాణిని (38) ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. దీంతో తన పిల్లలతో కలిసి మొదటి భార్య స్వర్ణలత.. తన బందువుల దగ్గర ఉంటోంది. అక్క భర్తనే పెళ్లి చేసుకొన్న నిషారాణిని ఆమె తల్లిదండ్రులు, బంధువులు సైతం దూరంగా పెట్టారు. ఈ క్రమంలో నిషారాణిపై అనుమానం పెంచుకొన్న అరుణ్ తరచూ వేధించేవాడు. నిషారాణి చంపాలని నిర్ణయించుకుని.. పాత బస్తీలోని తన మిత్రుల ద్వారా ఒక తుపాకీ కొన్నాడు. గత మార్చి నెలలో ఆ తుపాకీతో అంబర్‌పేట దగ్గర హల్‌చల్ చేయడంతో అరుణ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అరుణ్.. బంధువుల ఇంట్లో ఉంటున్న నిషారాణి వద్దకు వెళ్లాడు. బాగా చూసుకొంటానని నమ్మబలికి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇటీవల మళ్లీ ఆమెను వేధించడం ప్రారంభించాడు. పాత బస్తీలోని మిత్రుల ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసిన అరు ణ్.. బుధవారం తెల్లవారుజామున భార్య తలపై మూడు రౌండ్లకాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావమై నిషారాణి అక్కడిక్కడే మరణించింది. వెంటనే అరుణ్ అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ ఆధ్వర్యం లో రెండు బృందాలు అరుణ్‌కోసం గాలిస్తున్నాయి.