కూలికి వెళ్తూ పరువు తీస్తోందని...మాజీ భార్యను చంపేశాడు
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:12 AM
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన సోడదాసి సీతారామరాజు(పండు), అదే గ్రామానికి...
అడ్డు వచ్చిన అత్తనూ అంతం చేశాడు.. బొబ్బిల్లంకలో ఘటన
సీతానగరం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన సోడదాసి సీతారామరాజు(పండు), అదే గ్రామానికి చెందిన లత 15 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. మనస్పర్థల కారణంగా రెండేళ్ల కిందట విడిపోగా సీతారామరాజు మరో పెళ్లి చేసుకున్నాడు. లత పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారం చేసే సీతారామరాజు ‘నువ్వు కూలి పని చేస్తే నా పరువు పోతుంది. కూలి పని చేయవద్దు’ అని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె కూలి పనికి వెళుతోందనే కోపంతో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మరో ముగ్గురిని వెంటబెట్టుకుని లత ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. నీకూ నాకూ సంబంధం లేదంటూ నేనెలా బతికితే నీకెందుకు అని లత(35) అనడంతో కత్తితో దాడి చేశాడు. తన కుమార్తెను చంపవద్దని లత తల్లి లక్ష్మి (52) అడ్డు వెళ్లగా ఆమెనూ నరికి చంపేశాడు. తీవ్ర గాయాలతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.