ఆడపిల్లలే పుడుతున్నారనే కోపంతో..
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:49 AM
సంతానంగా కొడుకే పుట్టాలని.. కుమార్తెలు పుట్టొద్దని అనుకున్న ఆ వ్యక్తి, తనకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడం.. ఆ తర్వాత భార్య గర్భం దాల్చిన రెండుసార్లు ఆడపిల్లే జన్మించనుందని లింగనిర్ధారణ....
గర్భిణి అయిన భార్యను, పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలను హత్యచేసిన వ్యక్తి
ఓ బాలికను పెళ్లాడి కొడుకును కనాలనే ఆలోచన
భార్య, పిల్లలను స్విమ్మింగ్‌పూల్‌లో ముంచి హత్య
ఐనవోలు ఘటనలో వీడిన ముగ్గురి హత్య కేసు మిస్టరీ
వరంగల్ క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): సంతానంగా కొడుకే పుట్టాలని.. కుమార్తెలు పుట్టొద్దని అనుకున్న ఆ వ్యక్తి, తనకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడం.. ఆ తర్వాత భార్య గర్భం దాల్చిన రెండుసార్లు ఆడపిల్లే జన్మించనుందని లింగనిర్ధారణ పరీక్షల ద్వారా నిర్ధారించుకొని బలవంతంగా గర్భస్రావం చేయించాడు. ఐదోసారి భార్య గర్భం దాల్చగా ఈసారీ ఆడబిడ్డే పుట్టనుందనుకొని ఉన్మాదిగా మారిపోయాడు! ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, కడుపున పుట్టిన పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కూతుళ్లను స్విమ్మింగ్ పూల్ నీళ్లలో ముంచి, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో జరిగిన ముగ్గురి అనుమానాస్పద మరణానికి సంబంధించిన మిస్టరీ వీడింది. వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడించారు. పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ ఓ స్విమ్మింగ్‌పూల్ నిర్వహిస్తున్నాడు. 2016లో అదే గ్రామానికి చెందిన ఫరాహత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తెలు హమేరా (9), అయేషా (6) ఉన్నారు 2021లో ఫరాహత్ మళ్లీ గర్భం దాల్చింది. తల్లిదండ్రులు చాంద్‌పాషా, సలీహా.. సోదరుడు షర్పోద్దీన్ ఒత్తిడి మేరకు అజారుద్దీన్ భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించాడు. పున్నేలుకు చెందిన మెడికల్ షాపు నిర్వాహకుడు సట్ల రాజు, కొండపర్తికి చెందిన ఆర్‌ఎంపీ లింగాల నరేశ్, గీసుగొండకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ బొమ్మెర మనోహర్, ఏనుగల్లుకు చెందిన వాంకుడోతు భద్రు, వరంగల్ జిల్లా నెక్కొండ ఉపేందర్ ఆస్పత్రికి చెందిన పార్ధు, నర్సంపేట బాలాజీ ఆస్పత్రికి చెందిన బాల్నే పూర్ణిమ, కాజీపేట సాయి సురక్షా ఆస్పత్రికి చెందిన వైద్యురాలు రవళి, కడిపికొండకు చెందిన నర్సు బస్కె స్రవంతి సహకారంతో అజార్దుద్దీన్ పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్ధారించుకున్నారు.
ఫరాహత్‌కు ఇష్టం లేకున్నా ఆమెకు గర్భస్రావం చేయించాడు. 2022లోనూ ఆమె గర్భం దాల్చగా పుట్టబోయేది ఆడపిల్లేనని తెలుసుకొని అబార్షన్ చేయించాడు. వరుసగా ఆడపిల్లలనే కంటున్నావంటూ ఫరాహత్‌ను భర్త, అత్తామామలు, మరిది వేధింపులకు గురిచేసేవారు. ఈ క్రమంలో అజారుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకొని కొడుకును కనాలని అనుకున్నాడు. భార్య, పిల్లలు ఉండగా వివాహం చేసుకోలేనని ఆ బాలిక చెప్పడంతో హత్యలకు పథకం పన్నాడు. ఐస్‌క్రీమ్ తినిపిస్తానని చెప్పి గర్భం దాల్చిన భార్యను, ఇద్దరు కుమార్తెలను ఈనెల 1న రాత్రి ఏడింటికి స్విమ్మింగ్‌పూల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ విద్యుత్తు సరఫరా నిలిపివేసి, సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను నీళ్లలోకి తోసి.. వారి తలలను నీళ్లలో ముంచి చంపాడు. తర్వాత ఏమీ తెలియనట్లుగా భార్య, పిల్లలు స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతిచెందినట్లుగా ప్రచారం చేసుకున్నాడు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అజారుద్దీన్‌ను విచారించగా తానే చంపినట్లు ఒప్పుకొన్నాడు. అతడిని, హత్యకు సహకరించిన అతడి తల్లిదండ్రులు, సోదరుడిని, ఫరాహత్‌కు గర్భంస్రావం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైద్యులు పూర్ణిమ, రవళి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా బాలిక విషయంలో మామునూరు పీఎ్‌సలో నిందితుడు అజారుద్దీన్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు.