మహావీర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:02 AM
జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వికారాబాద్‌లోని మహావీర్ ఆసుపత్రిలో చేర్పించిన ఇద్దరు చిన్నారులు ఒకేరోజు మృతి చెందారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణం: తల్లిదండ్రులు
వికారాబాద్ పట్టణంలో దారుణం
వికారాబాద్, జూన్ 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వికారాబాద్‌లోని మహావీర్ ఆసుపత్రిలో చేర్పించిన ఇద్దరు చిన్నారులు ఒకేరోజు మృతి చెందారు. మృతుల్లో ఒకరు 5 నెలల పాప కాగా, మరొకరు 18 నెలల బాబు. నవాబ్‌పేట మండలం, మీనపల్లి కలాన్‌కు చెందిన మధుకర్, మౌనిక తమ 5నెలల కుమార్తెకు జ్వరం రావడంతో మహావీర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చాలాసేపటి వరకు చికిత్స చేయకపోవడంతో జ్వరం పెరిగి ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు పాప చేతిలో తాళం చెవి పెట్టేందుకు యత్నించగా, వారిని డాక్టర్లు బయటకు పంపించారు. అనంతరం పరీక్షలకు సిఫారసు చేసి, సూచించిన మందులు తీసుకు రావాలని చెప్పడంతో పాప తల్లిదండ్రులు ఫార్మసీకి వెళ్లి తీసుకొచ్చేలోపే పాప మృతి చెందిందంటూ డాక్టర్లు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప మృతి చెందిందని వారు ఆరోపించారు. డాక్టర్లు సెల్‌ఫోన్‌లో సలహాలు తీసుకుంటూ వైద్యం చేశారని, పాప మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, నవాబ్‌పేట మండలం, చించల్‌పేట్‌కు చెందిన సాయి, శోభ తమ 18 నెలల బాబుకు జ్వరం రావడంతో వికారాబాద్‌లోని మహవీర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న డాక్టర్ చికిత్స చేస్తుండగానే బాబు పరిస్థితి విషమించింది. దీంతో హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని డాక్టర్ సూచించగా, తల్లిదండ్రులు ఆ ఏర్పాట్లలో ఉండగానే బాబు మృతి చెందాడు.