చంపి.. చాప చుట్టేశారు!
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:11 AM
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ప్రియుడి సహకారంతో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. ఆపై ఇద్దరూ కలిసి శవాన్ని చాపచుట్టి...
ప్రియుడితో కలిసి భర్త హత్య , మృతదేహంపై పెట్రోలుతో నిప్పు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం
ఎమ్మిగనూరు రూరల్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ప్రియుడి సహకారంతో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. ఆపై ఇద్దరూ కలిసి శవాన్ని చాపచుట్టి, పెట్రోలు పోసి తగలబెట్టేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి గురువారం వెల్లడించారు. గోనెగండ్ల మండలం పెద్దనేలటూరుకు చెందిన పులి నరేంద్ర అలియాస్ యేసేపు(32) పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఏడాది నుంచి వంశీ అనే వ్యక్తితో పద్మ వివాహేతర సంబంధం సాగిస్తోంది. విషయం నరేంద్రకు, తెలియడంతో పం చాయతీ జరిగింది. అయినా పద్మలో మార్పు లేదు. చివరికి పుట్టినిల్లు ఎమ్మిగనూరుకు పిల్లలతో పాటు వచ్చేసింది. వంశీ సూచనతో భర్తకు విడాకుల నోటీసులు పంపింది. ఈనెల 21న భర్తను ఎమ్మిగనూరుకు పిలిపించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి తన నిర్ణయాన్ని తెగేసి చెప్పింది. అదఏ రోజు వంశీని పిలిపించింది. అత్తింట్లోనే నిద్రిస్తున్న నరేంద్రను అర్ధరాత్రి ఇద్దరూ కలిసి చంపేశారు. భర్త కాళ్లను పద్మ కదలకుండా గట్టిగా పట్టుకోగా, వంశీ కత్తితో నరేంద్ర కుడి మెడ మీద, గొంతు వద్ద పొడిచి.. మోచేతితో గొంతు బిగించి చంపాడు. మృతదేహాన్ని చాపలో చుట్టి, సంచులలో కుక్కారు. బైక్‌పై ఎక్కించి ఎర్రకోట సమీప నాగలాపురం వంక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెట్రోల్‌ను నరేంద్ర శవంపై పోసి నిప్పటించారు. స్థానికులిచ్చిన సమాచారంతో పద్మను పోలీసులు విచారించడంతో గుట్టు రట్టయింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.