Share News

ప్రియుడితో కలిసి కొడుకునే చంపేసింది!

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:26 AM

ఐదేళ్ల కిత్రం భర్త మృతి చెందాడు. సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొడుకు నిలదీయడంతో ప్రియుడితో కలిసి కన్నకొడుకునే కత్తితో పొడిచి చంపేసింది.

ప్రియుడితో కలిసి కొడుకునే చంపేసింది!

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘోరం

  • ఆపై ఏమీ ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు

  • కొడుకు ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులోనూ పిటిషన్‌

  • ఏడాదిన్నర తరువాత నిగ్గు తేల్చిన పోలీసులు

  • అదేరోజు అనారోగ్యంతో నిందితురాలి మృతి

  • కర్నూలు జిల్లాలో సినిమాను మించిన ట్విస్టులు

కర్నూలు/కౌతాళం/ఆదోని రూరల్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల కిత్రం భర్త మృతి చెందాడు. సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొడుకు నిలదీయడంతో ప్రియుడితో కలిసి కన్నకొడుకునే కత్తితో పొడిచి చంపేసింది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని మాయం చేశారు. ఆపై కొడుకు అదృశ్యమయ్యాడంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందా తల్లి. తన కొడుకు ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం సీరియస్‌ కావడంతో డీజీపీ సిట్‌ను నియమించారు. పోలీసుల విచారణలో గుట్టు రట్టయింది. ఏడాదిన్నర క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని ఆదివారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. అయి తే.. కేసులో ప్రధాన నిందితురాలైన కన్నతల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారమే మృతిచెందింది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన సినిమాను మించిన కథ ఇది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..


ఇంట్లోనే కత్తితో పొడిచి..

ఆదోని మండలం జి.హోసళ్లి గ్రామానికి చెందిన మాల గంగమ్మ(40)కు వీరేంద్ర(15) మరో ఇద్దరు సంతానం. భర్త పెద్ద లక్ష్మయ్య ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తరువాత ఆమెకు సమీప బంధువు బేగారి దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై వీరేంద్ర నిలదీయడంతో దర్గప్పతో కలసి గంగమ్మ.. కన్నకొడుకు వీరేంద్రను 2024 నవంబరులో ఇంట్లోనే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి ఊరి బయటకు తీసుకొచ్చి మాయం చేశారు. అనంతరం 2024 నవంబరు 11 నుంచి వీరేంద్ర కనిపించడం లేదంటూ గంగమ్మ అదేనెల 13న కౌతాళం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినా, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా వదిలేశారు. దీంతో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారించిన న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. 20 రోజుల్లోగా సమగ్ర వివరాలతో న్యాయస్థానం ముందు హాజరు కావాలని రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆగ్రహంతో వీరేంద్ర అదృశ్యంపై డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా స్పందించారు. విజయవాడకు చెందిన అడిషనల్‌ ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో డీఎస్పీ రవికుమార్‌, ఘటన జరిగిన సమయంలో ఉన్న కౌతాళం సీఐ అశోక్‌కుమార్‌తో సిట్‌ను నియమించారు. రెండు వారాల క్రితం వారు ఆదోనికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సాంకేతిక ఆఽధారాలు సేకరించి నిందితులను తమదైన శైలిలో పోలీసులు విచారించంగా నేరం ఒప్పుకొన్నారు. వీరేంద్రను ఇంట్లోనే హత్య చేసినట్లు అంగీకరించినా, మృతదేహం ఎలా మాయం చేశారో చెప్పకుండా దృశ్యం సినిమా సన్నివేశాలు తలపించే ట్విస్టులు చూపారని పోలీసులు పేర్కొంటున్నారు. చివరికి జి.హోసళ్లి శ్మశానంలో పూడ్చిపెట్టామని బేగారి దర్గప్ప ఒప్పుకొన్నాడు. ఆదివారం ఏఏస్పీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం జరిపించారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం గంగమ్మ అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న ఆమె అనూహ్యంగా ఆదివారం మృతి చెందింది. ఆమె మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 05:30 AM