Share News

ఒకరి తర్వాత మరొకరు అమాయక బాలికను వంచించిన ముగ్గురు

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:33 AM

చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న 14 ఏళ్ల బాలికపై.. ముగ్గురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు.

ఒకరి తర్వాత మరొకరు అమాయక బాలికను వంచించిన ముగ్గురు

  • ప్రేమ పేరుతో ఒకరు.. భయపెట్టి మరో ఇద్దరు

  • బాలికపై ముగ్గురు యువకుల లైంగిక దాడి

  • భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో అమానవీయ ఘటన

  • నిందితుల్లో ఆటో డ్రైవర్లు, ఒక కానిస్టేబుల్‌

  • నలుగురి అరెస్ట్‌.. పరారీలో ఇద్దరు

చుంచుపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న 14 ఏళ్ల బాలికపై.. ముగ్గురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, ప్రేమ పేరుతో దగ్గరై ఒకడు లైంగిక దోపిడీకి పాల్పడగా.. ఈ విషయం నలుగురికీ చెబుతామని బెదిరించి మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురిని అరెస్ట్‌ చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మీడియాకు వెల్లడించారు. కొత్తగూడెం టూ టౌన్‌ పరిధిలో నివసించే 14ఏళ్ల బాలికకు తండ్రి మరణించగా తల్లి మాత్రమే ఉంది. తల్లి కూలి పనులు చేస్తూ ఒక్కగానొక్క కూతురిని పోషిస్తోంది. చుంచుపల్లి మండలం గరీబ్‌పేటకి చెందిన ఆటోడ్రైవర్‌ మార్తి రామకృష్ణ.. ప్రేమ పేరుతో సదరు బాలికకు దగ్గరయ్యాడు. ఈ నెల 3న పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి ఓల్డ్‌ డిపో ప్రాంతంలోని తన బావ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆ విషయాన్ని తన స్నేహితులైన కలకుంట్ల విజేందర్‌, బడేటి మహే్‌షకు చెప్పాడు. దీంతో వారు బాలికను భయపెట్టారు. తమ వాంఛ తీర్చకపోతే నలుగురికీ చెబుతామని బెదిరించి.. ఈనెల 4, 5వ తేదీల్లో ఆమెను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ముభావంగా ఉంటుండం గమనించిన తల్లి ఈ నెల 11న ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పింది.


దీంతో బాలిక తల్లి కొత్తగూడెం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై పోక్సో, అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆటోడ్రైవర్లు రామకృష్ణ, విజేందర్‌, మహేష్‌, నవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మూడు ఆటోలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు కానిస్టేబుల్‌ వెంకటేష్‌, ఆటోడ్రైవర్‌ గణేష్‌ పరారీలో ఉన్నట్టు డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.

Updated Date - Jul 16 , 2026 | 06:34 AM