Share News

నడిరోడ్డుపై వెంటాడి.. భార్యను పొడిచి చంపిన భర్త

ABN , Publish Date - May 07 , 2026 | 04:45 AM

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను నడిరోడ్డుపై వెంటాడి అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపాడో భర్త..

నడిరోడ్డుపై వెంటాడి.. భార్యను పొడిచి చంపిన భర్త

  • కుటుంబ కలహాలే కారణం

  • ఠాణాలో పోలీసులు సర్ది చెప్పి పంపిన కాసేపటికే దారుణం

  • సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన

  • ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం..

కోదాడ, మే 6 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను నడిరోడ్డుపై వెంటాడి అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపాడో భర్త.. వివాదం నేపథ్యంలో ఠాణాకు వచ్చిన ఇరువురికి పోలీసులు సర్ది చెప్పి పంపిన కాసేపటికే ఈ దారుణం జరిగింది. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కోదాడలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని బాబునగర్‌కు చెందిన మణిదీప్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జగ్గయ్యపేటకు చెందిన శిరీష(24)ను ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శిరీష చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందగా, కోదాడలోని పిన్ని మంగ ఇంట్లో ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ పెళ్లికి దారితీసింది. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలుజరుగుతున్నాయి. ఏడాది క్రితం గొడవ జరగ్గా, పెద్దల సమక్షంలో మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరించుకుని కలిసే ఉంటున్నారు. ఇదిలాఉండగా రెండు రోజుల క్రితం ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బుధవారం శిరీషతోపాటు, ఆమె పెద్దమ్మ, మణిదీ్‌పలు కోదాడ పోలీస్‌ స్టేషన్‌కు రాగా.. పోలీసులు వారికి సర్ది చెప్పి పంపారు. ఠాణా బయటికి వచ్చాక జగ్గయ్యపేట వెళ్లేందుకు పెద్దమ్మతో కలిసి శిరీష ఆటో ఎక్కింది. ఇంతలోనే మణిదీప్‌.. భార్య శిరీషను ఆటోలో నుంచి బయటికి లాగటంతో ప్రాణ భయంతో ఆమె రోడ్డు పక్కనున్న టీ స్టాల్‌లోకి పరుగెత్తింది. అందరూ చూస్తుండగానే కత్తితో వెంటాడిన మణిదీప్‌.. ఆమెను పలుమార్లు పొడిచాడు. అక్కడి వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే శిరీషకు తీవ్ర రక్తస్రావం కాగా.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శిరీష మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త మణిదీ్‌పను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. మణిదీప్‌ భార్య శిరీషను కత్తితో పొడుస్తున్న దృశ్యాలు టీ స్టాల్‌ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్‌ తెలిపారు.

Updated Date - May 07 , 2026 | 04:45 AM