Share News

బీమా డబ్బుల కోసం భర్తనే చంపించింది!

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:31 AM

అనారోగ్యంతో ఉన్న భర్త ఎలాగూ చనిపోతాడని పథకం ప్రకారం పెద్ద మొత్తంలో జీవిత బీమా పాలసీ తీసుకుందామె! నెలలు గడస్తున్నా అతడు చనిపోకపోవడంతో బీమా డబ్బులపై ఆశతో మరో నలుగురితో కలిసి చంపించింది.

బీమా డబ్బుల కోసం భర్తనే చంపించింది!

  • అనారోగ్యంతో ఉన్నాడని 66 లక్షలకు పాలసీ తీసుకున్న భార్య

  • ఎన్ని నెలలైనా చావకపోవడంతో హత్య చేయించాలని నిర్ణయం

  • కారుతో ఢీకొట్టించి హత్య

  • ఖమ్మంలో ఘటన..

  • ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

ఖమ్మం రూరల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ఉన్న భర్త ఎలాగూ చనిపోతాడని పథకం ప్రకారం పెద్ద మొత్తంలో జీవిత బీమా పాలసీ తీసుకుందామె! నెలలు గడస్తున్నా అతడు చనిపోకపోవడంతో బీమా డబ్బులపై ఆశతో మరో నలుగురితో కలిసి చంపించింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం రూరల్‌ సీఐ ముష్కరాజు ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఖమ్మం నగరానికి చెందిన చాగంటి రవి(52) ఆటో డ్రైవర్‌. ఆయనకు భార్య ప్రశాంతి ఉంది. రవి తాగుడుకు పూర్తిగా బానిసై అనారోగ్యంపాలయ్యాడు. భర్త త్వరలోనే చనిపోతాడని భావించిన ప్రశాంతి, అతడి పేరిట పెద్ద మొత్తంలో బీమా చేయించాలని నిర్ణయించింది. గత ఏడాది జూలైలో రవికి బావమరిది వరుస అయిన దేశబోయిన శ్రీనివా్‌సతో కలిసి తమకు తెలిసిన ఓ ఏజెంట్‌ ద్వారా రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్‌ చేయించింది. నెలలు గడుస్తున్నా రవి చనిపోకపోవడంతో బీమా డబ్బుల కోసం ప్రశాంతి పథకం వేసింది. దేశబోయిన శ్రీనివాస్‌, అతడి స్నేహితులు జోగి రాజ్‌కుమార్‌, జోగి వెంకటేశ్‌, జోగి రాంబాబులను సంప్రందించి కుట్ర పన్నింది. రవిని చంపితే వచ్చే డబ్బుల్లో సగం ఇస్తానని వారితో ఒప్పందం చేసుకుంది. పథకం ప్రకారం శ్రీనివాస్‌.. ఈనెల 2న రవిని ఆటోలో ఎక్కించుకువెళ్లి.. ఫుల్లుగా మద్యం తాగించాడు. ఖమ్మం రూరల్‌ మండలం వీవీ పాలెం శివారులో అతడిని వదిలేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి జోగి వెంకటేశ్‌కు చెందిన కారును జోగి రాజ్‌కుమార్‌ వేగంగా నడుపుతూ వచ్చి రవిని వెనుకనుంచి ఢీకొట్టాడు. ఈ ఘటన సమయంలో ఆ రోడ్డులో ఎవరైనా వస్తున్నారా? అని గమనించేందుకు జోగి రాంబాబును కాపలా పెట్టారు. ఘటన తర్వాత తర్వాత రాజ్‌కుమార్‌ ఆ కారును ఖమ్మం రూరల్‌ మండలంలోని తనగంపాడు గ్రామంలోని వెంకటేశ్‌కు మిత్రుడైన సురేశ్‌ ఇంటివద్ద ఉంచాడు. కారు ప్రమాదానికి గురైందని, తర్వాత వచ్చి తీసుకెళతాని చెప్పి వెళ్లిపోయాడు. వీవీ పాలెం శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభించి.. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. రవి భార్య ప్రశాంతే హత్యకు కుట్ర పన్నిందని తేల్చారు. హతుడి భార్య ప్రశాంతిని, మిగతా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Mar 09 , 2026 | 04:32 AM