Share News

అంకుల్‌ కాదు.. మానవ మృగం

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:56 AM

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి తీరుకు బాలిక కేకలు వేయగా..

అంకుల్‌ కాదు.. మానవ మృగం

  • 12 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి.కి యత్నం.. కేకలు వేయడంతో నాలుగో అంతస్తు నుంచి తోసివేత

  • తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రికి బాలిక

  • ఖమ్మంలో దారుణం.. నిందితుడి అరెస్టు.. రిమాండ్‌

ఖమ్మం క్రైం, ఖమ్మం రూరల్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి తీరుకు బాలిక కేకలు వేయగా.. తన దుశ్చర్య బయటపడకూడదని ఆ చిన్నారిని భవనం నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాలిక.. రెండ్రోజుల చికిత్స అనంతరం కళ్లు తెరవడంతో.. ‘అంకుల్‌’ చేసిన కిరాతకం వెలుగు చూసింది. ఖమ్మం సమీపంలోని ఓ మండలానికి చెందిన 12ఏళ్ల బాలిక ఓ గురుకుల పాఠశాలలో చదువుతోంది. బాలిక తాత ఖమ్మంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌గా పని చేస్తునారు. వేసవి సెలవులు నేపథ్యంలో ఆ బాలిక పది రోజుల క్రితం తాత ఇంటికి వచ్చింది. ఈ నెల 6న బాలిక ఆడుకునేందుకు అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తుకు వెళుతుండగా.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే మహ్మద్‌ గౌస్‌పాషా (45) అనే డ్రైవర్‌ బాలికను వెనుక నుంచి పట్టుకుని అత్యాచారయత్నం చేశాడు. భయపడిన బాలిక కేకలు వేయగా.. తన దుశ్చర్య బయటపడకూదనే ఉద్దేశంతో పాషా కిరాతకానికి తెగబడ్డాడు. ఆ చిన్నారిని బలవంతంగా అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి తోసేశాడు. బాలిక అపార్ట్‌మెంట్‌ కింద ఉన్న గోడపై పడింది. ఆ కేక విన్న బాలిక తాత వచ్చి చూడగా రక్తపుమడుగులో మనవరాలు కనిపించింది. బాలికను వెంటనే ఖమ్మంలోని ఓఆస్పత్రికి తరలించగా.. వెన్నెముక రెండు చోట్ల, కాలు, కుడి భుజం విరిగినట్టు వైద్యులు తెలిపారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండగా .. ఆమె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందకి పడిపోయి ఉంటుందనే అంతా భావించారు. కానీ సోమవారం సాయంత్రం బాలిక స్పృహలోకి రాగా.. ఏం జరిగిందో తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా ‘ఆ అంకుల్‌ ఇలాచేశాడు’ అని బాలిక చెప్పింది.


అదివిని తల్లిదండ్రులు కుదేలయ్యారు. ఆపై, బాలిక తండ్రి సోమవారం రాత్రి ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు మహ్మద్‌ గౌస్‌పాషాపై పోక్సో కేసుతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు.. అదేరోజు అర్ధరాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో పోలీసులు హాజరుపరచగా.. న్యాయాధికారి రిమాండ్‌ విధించారు. ఇక, వృత్తిరీత్యా డ్రైవరైనా ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది సాయంతో పైరవీలు చేసే పాషా.. తాను చేసి న ఘోరం బయటపడిందని తెలిసిన వెంటనే పంచాయితీ కోసం ముగ్గురు రాజకీయ ప్రముఖులను ఆశ్రయించినట్టు చెబుతున్నారు. సెంటిల్‌మెంట్‌ కోసం ఆ ముగ్గురు ఓ వ్యక్తిని సంప్రదించారని, కానీ కేసు తీవ్రత తెలుసుకున్న తర్వాత పక్కకు తప్పుకున్నారని అంటున్నారు. మరోపక్క, ఈ ఘటన గురించి తెలుసుకున్న న్యాయాధికారి.. ఆస్పత్రికి వెళ్లి బాలిక వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. చిన్నారి ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి మంగళవారం తరలించారు.

వారం క్రితమే బాలికపై చేతులు వేసిన కామాంధుడు

పదిరోజులుగా తాతయ్య ఇంట్లో ఉంటున్న బాలికపై మహ్మద్‌ గౌస్‌పాషా వారం రోజుల క్రితం కూడా చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. దాంతో పాషా కనిపించినప్పుడల్లా తాను తప్పించుకుని తిరుగుతున్నానని ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపినట్టు సమాచారం. అతడు మాటల్లో చెప్పలేని విధంగా ప్రవర్తించాడని బాలిక వివరించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాషాను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.


అధైర్యపడకండి నేనున్నా.. పాపను కాపాడుకుందాం

  • బాధిత కుటుంబానికి మంత్రి పొంగులేటి పరామర్శ

ఖమ్మంలో 12ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం, హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రులతో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. ‘పాప ప్రాణాలను కాపాడుకుందాం. అధైర్యపడకండి నేనున్నా’ అని ధైర్యం చెప్పారు. బాలికకు తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలని, వైద్య ఖర్చులన్నీంటిని తానే భరిస్తానని భరోసా ఇచ్చారు.

Updated Date - Jun 10 , 2026 | 04:57 AM