Share News

కల్ల లైన కలలు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:18 AM

తమ ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నత విద్య చెప్పించి ప్రయోజకుడిని చేయాలని కలలు కన్నారు ఆ దంపతులు... కానీ వారి కలలు కల్లలయ్యాయి...

కల్ల లైన కలలు!

  • కుమారుడిని ఇంటర్‌లో చేర్పించేందుకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు దంపతులు

  • కుమారుడు, లారీ డ్రైవర్‌లకు తీవ్ర గాయాలు

  • కారును ఢీకొట్టిన లారీ.. ఆపై రెండు లారీల మధ్య నలిగిన కారు

  • ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద ప్రమాదం

కొణిజర్ల, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : తమ ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నత విద్య చెప్పించి ప్రయోజకుడిని చేయాలని కలలు కన్నారు ఆ దంపతులు... కానీ వారి కలలు కల్లలయ్యాయి... అతడిని ఇంటర్‌లో చేర్చేందుకు హైదరాబాద్‌ బయల్దేరగా మార్గమధ్యలోనే మృత్యువు కబళించింది... వారు ప్రయాణిస్తున్న కారును, దాని వెనుక వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో వీరి కారు రెండు లారీల మధ్య నలిగిపోయింది. దీంతో ఆ దంపతులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కన్నుమూశారు. వారి కుమారుడు, ఢీకొన్న లారీ డ్రైవర్‌ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో సాగర్‌కాల్వ వంతెనవద్ద ఈ ఘ టన జరిగింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌ దగ్గరలోని గాదాలమ్మనగర్‌కు చెందిన ఉండమట్ల వీర్రాజు(46), ఉండమట్ల వీరశైలజ(36) దంపతులు తమ కుమారుడు యశ్వంత్‌ను హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌లో చేర్చేందుకు ఆదివారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు కారులో బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున కొణిజర్ల దాటిన తర్వాత సాగర్‌కాల్వ వం తెన వద్ద ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళుతున్న ఖాళీ లారీ వీరి కారును ఢీకొట్టింది. అనంతరం కారు వెనుక వస్తున్న మరో లారీని కూడా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు రెండు లారీల మధ్య నలిగింది. దాంతో కారు నడుపుతున్న వీర్రాజు, పక్కన ఉన్న వీరశైలజ, యశ్వంత్‌లు తీవ్రం గా గాయపడ్డారు. ఢీకొట్టిన లారీ డ్రైవర్‌ శ్రీను కూడా తీవ్రం గా గాయపడ్డాడు. వీర్రాజు తీవ్రగాయాలతో కారులో, లారీ డ్రైవర్‌ శ్రీను క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. రెండు జేసీబీలతో వారిని బయటకు తీసి.. గాయపడిన నలుగురిని 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీర్రాజు, వీరశైలజ దంపతులు మృతి చెందగా.. వారి కుమారుడు యశ్వంత్‌, లారీ డ్రైవర్‌ శ్రీను చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ప్రమాద సమయంలో తండ్రి కారులో ఇరుక్కుపోవడంతో ‘ప్లీజ్‌ డాడీని కాపాడండి...’ అని యశ్వంత్‌ కేకలు వేశాడు. అప్పటికే గాయాలతో ఉన్న యశ్వంత్‌.. సీట్లలో స్పృహతప్పి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలవిసేలా రోదించడం.. అక్కడి వారిని కలచివేసింది.

Updated Date - Apr 07 , 2026 | 05:18 AM