వాళ్లు ఎలా చనిపోయారు?
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:00 AM
ఆ ఇంట్లో ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు..!! నలుగురు సభ్యుల ఓ కుటుంబంలోని తండ్రి, పెద్ద కుమార్తె తమ ఇంట్లోనే అనుమానస్పద స్థితిలో మరణించారు.
అనుమానాస్పద స్థితిలో భర్త, పెద్ద కుమార్తె మృతి
పురుగుమందు తాగి భార్య ఆత్మహత్యాయత్నం
మూడేళ్ల చిన్నకుమార్తె నుదిటిపై గాయం
ఖమ్మంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం
ఖమ్మం క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఆ ఇంట్లో ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు..!! నలుగురు సభ్యుల ఓ కుటుంబంలోని తండ్రి, పెద్ద కుమార్తె తమ ఇంట్లోనే అనుమానస్పద స్థితిలో మరణించారు. ఖమ్మంలో ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. ఆ ఇంటి ఇల్లాలే ఘాతుకానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగరం గ్రామానికి చెందిన కణతాల రాము(31) ఓ డిజిటల్ మీడియాలో విలేకరిగా పని చేస్తున్నాడు. రాముకు సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రమ్యకు ఆరేళ్ల క్రితం వివాహమవ్వగా వీరికి దివ్యశ్రీ (5), రితిక(3) అనే కుమార్తెలు ఉన్నారు. రాము తన కుటుంబంతో కలిసి ఖమ్మంలోని బుర్హాన్‌పురం కరెంట్ ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. అయితే, రెండ్రోజులుగా ఫోన్లకు స్పందించకపోవడంతో రమ్య తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఖమ్మం వచ్చారు. ఎంతపిలిచినా ఇంట్లోని వారెవ్వరూ స్పందించకపోవడంతో స్థానికుడైన సతీశ్ అనే వ్యక్తి సాయంతో ఇంటి కిటికీ తెరిచి చూశారు. ఇంట్లో నుంచి దుర్వాసన వెలువడగా.. తలుపు తెరిచి లోపలకి వెళ్లి చూడగా రాము, దివ్యశ్రీ రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారి పక్కనే రమ్య కూడా అపస్మారక స్థితిలో పడి ఉంది. రాము, రమ్య దంపతుల చిన్న కుమార్తె రితిక... ఇంట్లోని ఓ తలుపు మూల భయంతో ఏమి మాట్లాడకుండా కూర్చొని ఉంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చిన రమ్య తల్లిదండ్రులు, స్థానికులు.. నుదిటిపై గాయంతో ఉన్న రితికను, పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రమ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, రాము ముఖంపై గాయం ఉండగా.. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగి ఆ క్రమంలోనే హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. భర్త, కుమార్తెను చంపిన రమ్య.. ఆదివారం ఉదయం బయటకు వెళ్లి పురుగు మందు తెచ్చుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.