లాయర్ హత్య కేసు.. పోలీసుల అదుపులో సూత్రధారులు!
ABN , Publish Date - May 27 , 2026 | 04:40 AM
హైకోర్టు న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సూత్రధారులుగా అనుమానిస్తున్న తండ్రీ ...
మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు!
హత్య కోసం సుపారీ గ్యాంగ్‌కు 10 లక్షల అడ్వాన్స్
ఆరు నెలలుగా న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ హత్యకు కుట్ర
ముఠాలో నలుగురు.. గోవాలో అరెస్టు !
హైదరాబాద్ సిటీ, ఇబ్రహీంపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సూత్రధారులుగా అనుమానిస్తున్న తండ్రీ కొడుకులు మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేస్తున్న తన తండ్రిని మహబూబ్, ముజాహిద్‌లే చంపించారని హత్య జరిగిన నాటి నుంచి ఖాజా మొహియుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఖాజా మొహియుద్దీన్‌ను హత్య చేసిన నలుగురు సుపారీ హంతకులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ముఠాలో హైదరాబాద్‌లోని కవాడిగూడకు చెందిన వినయ్ కీలకపాత్ర పోషించాడని, అతనితోపాటు ముగ్గురు అనుచరులు హత్యలో పాలుపంచుకున్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని (స్కార్పియో) కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని కృష్ణా పైపులైన్ వెంట ఉన్న బైపా్‌సరోడ్డులో హంతకులు ఈ వాహనాన్ని వదిలివెళ్లినట్లు సమాచారం. కాగా, హంతకులు నలుగురు గోవాకు పారిపోయారని, పోలీసు బృందాలు గాలించి వారి ఆచూకీ కనుగొని పట్టుకున్నట్లు తెలిసింది. ఖాజా మోహియుద్దీన్‌ను హత్య చేయటానికి 6 నెలల క్రితమే ప్రత్యర్థులు సుపారీ గ్యాంగ్‌కు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి హత్యకు కుట్ర పన్నుతున్న ముఠా.. కారుతో ఢీకొట్టి చంపాలని నిర్ణయించుకొని ఓ సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసింది. ఖాజా మొహియుద్దీన్ రోజువారీ కదలికలపై దృష్టి పెట్టిన హంతకులు.. ఈ నెల 23న ఉదయం మొహియుద్దీన్ బయటకు వచ్చి కారు తలుపు తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మొహియుద్దీన్ చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది.