Share News

లైంగిక కోరికలు తీర్చుతామంటూ ఎర

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:51 AM

లైంగిక కోరికలు తీర్చుతామంటూ స్వలింగ సంపర్కులను మాటల్లోకి దించి.. నగ్నంగా ఫొటోలు తీసి అందినకాడికి దోచుకుంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

లైంగిక కోరికలు తీర్చుతామంటూ ఎర

  • పలువురిని నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు

  • కీసరలో ఆరుగురి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

కీసర రూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): లైంగిక కోరికలు తీర్చుతామంటూ స్వలింగ సంపర్కులను మాటల్లోకి దించి.. నగ్నంగా ఫొటోలు తీసి అందినకాడికి దోచుకుంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఈ ముఠాకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్‌ వివరించారు. వరంగల్‌కు చెందిన కసుమ కార్తి, రాంరాజ్‌, బబ్లూ సింగ్‌, కందుల సాయితేజ, గండ్ల శ్రవణ్‌, మాచర్ల పవన్‌ కల్యాణ్‌, చెన్నకేశవుల పవన్‌ కల్యాణ్‌ ఒక ముఠాగా ఏర్పడ్డారు. లైంగిక కోరికలు తీర్చుతామంటూ గ్రైండర్‌ (గే ఆప్‌) అనే ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్షిస్తున్నారు. యాప్‌ ద్వారా ఈ ముఠాను ఆశ్రయించిన వారిని ఓఆర్‌ఆర్‌ వెంట నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, దుస్తులు విప్పించి, నగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నారు. అనంతరం వారి వద్దనున్న బంగారు వస్తువులతో పాటు నగదును దోచుకుని పారిపోతున్నారు. విషయం బయటకు పొక్కితే వీడియోలు విడుదల చేస్తామని బాధితులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ నెల 6న ముఠా బారిన పడి మోసపోయిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన బబ్లూ సింగ్‌ పరారీలో ఉండగా మిగతా వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి బంగారు చైన్‌, స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, న్యూ వెస్పా స్కూటీ, 6 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Updated Date - Apr 12 , 2026 | 03:51 AM