వారు ఆడపిల్లలుగా పుట్టడమే నేరమైందా?
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:21 AM
ఆడపిల్లలనే వివక్షతోనే కవలలను కన్నతండ్రి కచ్చు శ్రీశైలం హత్యకు ఒడగట్టినట్లు.. ఇందుకు అతడి తల్లిదండ్రులు, సోదరుడు రాకేశ్ సహకరించినట్లు పోలీసులు తేల్చారు.
ఆడపిల్లలని తెలిసి గర్భస్రావానికి ఒత్తిడి.. ఒప్పుకోని భార్య
కవలలపై వివక్షతోనే హత్యచేసిన తండ్రి శ్రీశైలం
హత్యకు సహకరించిన శ్రీశైలం తల్లిదండ్రులు, సోదరుడు
కరీంనగర్ రూరల్ జూబ్లీనగర్ కేసును ఛేదించిన పోలీసులు
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఆడపిల్లలనే వివక్షతోనే కవలలను కన్నతండ్రి కచ్చు శ్రీశైలం హత్యకు ఒడగట్టినట్లు.. ఇందుకు అతడి తల్లిదండ్రులు, సోదరుడు రాకేశ్ సహకరించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్‌లో కవలు గీతాన్షి(4), గీతాన్విత(4) హత్య కేసును ఛేదించారు. పోలీసు కమిషనర్ గౌస్ ఆలం సోమవారం వివరాలు వెల్లడించారు. జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలం 2020లో మానకొండూర్ మండలం లక్ష్మిపూర్‌కు చెందిన చుక్క మౌనికను పెళ్లి చేసుకున్నాడు. ఆడపిల్లలంటే ఇష్టం లేని శ్రీశైలం, భార్య గర్భం దాల్చిందని తెలియగానే స్కానింగ్ తీయించి.. పుట్టబోయేది ఆడపిల్లలని తెలుసుకొని గర్భస్రావం చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి తేగా, ఆమె ఒప్పుకోలేదు. 2022లో మౌనిక.. గీతాన్షి, గీతాన్వితలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి భార్యపై శ్రీశైలం వేధింపులు మొదలయ్యాయి. ఎలాగైనా పిల్లలను చంపాలనుకున్నాడు. తన తల్లిదండ్రులు లావణ్య, అశోక్.. తమ్ముడు రాకేశ్‌తో కలిసి పథకం రూపొదించాడు. శనివారం మధ్యా హ్నం పిల్లలతో కలిసి ఊర్లోని తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ పిల్లల ను బావిలో పడేసి, చంపేశాడు. సాయంత్రమైనా పిల్లలు, భర్త ఇంటికి రాకపోవటం తో భార్య మౌనిక వ్యవసాయబావి వద్దకు వెళ్లి గట్టిగా అరించింది. మౌనిక అరుపులు విన్న శ్రీశైలం బావిలోంచి పెద్దగా అరిచాడు. మౌనిక బావి వద్దకు వెళ్లిచూడగా గీతాన్షిత మృతదేహంతో శ్రీశైలం కనిపించాడు. ఇద్దరు పిల్లలు బావిలోపడగా రక్షించేందు కు నీళ్లలోకి దూకానని ఆమెను నమ్మించే యత్నం చేశాడు. అప్పటికే పరిసర ప్రాంత రైతులు బావి వద్దకు చేరుకొని శ్రీశైలాన్ని తాళ్ల సాయంతో పైకి తీశారు. శ్రీశైలం పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానించిన గ్రామస్థులు అతడిని కొట్టారు. శ్రీశైలం వారి నుంచి తప్పించుకొని తల్లి, తండ్రి, సోదరుడితో కలిసి గోపాల్‌పూర్‌లోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నలుగురు నిందితులు నేరం ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు.