అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది!
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:42 AM
ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వ్యక్తితో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు జ్యూస్‌లో నిద్రమాత్రలిచ్చి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
నిద్ర మాత్రలు ఇచ్చి... దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో భార్య వివాహేతర సంబంధం
కాకినాడ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
కటకటాల పాలైన భార్య, ప్రియుడు
సర్పవరం జంక్షన్ (కాకినాడ), జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వ్యక్తితో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు జ్యూస్‌లో నిద్రమాత్రలిచ్చి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అయితే చివరకు ప్రియుడి ఇచ్చిన సమాచారంతోనే నిందితులు ఇద్దరూ కటాకటాల పాలయ్యారు. కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పవరం మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ (38), దేవి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. భర్త ఆటో నడుపుతాడు. రెండేళ్ల కింద దుర్గాప్రసాద్ గుండెలో స్టంట్లు వేశారు. దాంతో అతను ఇంటి వద్దే ఉండేవాడు. ఈ క్రమంలో దేవికి ఇన్‌స్టాగ్రామ్‌లో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపిసాయి బైక్‌పై బాపట్ల నుంచి సర్పవరం వచ్చి.. దేవిని విజయవాడ, రామచంద్రపురం తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. భార్య వ్యవహారంపై అనుమానం రావడంతో దుర్గాప్రసాద్ నిలదీశాడు. ఫోన్‌లో చాటింగ్ చేయకుండా నిలువరించాడు. అయినప్పటికీ దేవి ప్రియుడితో సంబంధం కొనసాగించింది. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు, నిద్రమాత్రలతో హతమారుద్దామని ప్లాన్ వేసి ప్రియుడికి చెప్పింది. దీంతో గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్రమాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇచ్చాడు. ఈ ఏడాది మార్చి 13న ఖర్జూజ జ్యూస్‌లో 13 నిద్రమాత్రలు వేసి భర్తతో తాగించింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లగా, బతుకుతాడేమోనన్న భావనతో ముఖంపై దిండు అదిమి పట్టుకుని ఊపిరాడకుండా హతమార్చింది. అనంతరం భర్తకు గుండెపోటు వచ్చిందని దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
నిందితురాలిని పట్టించిన ప్రియుడు!
అయితే భర్త హత్య అనంతరం దేవి ప్రియుడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమె తనకు దూరమవుతుందని, వేరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నట్లు భావించిన గోపిసాయి.. మూడు నెలల తర్వాత ఈ నెల 9న దేవి కుమార్తె సెల్‌ఫోన్‌కు వాట్సా్‌పలో ఓ మెసేజ్ పంపాడు. ‘మీ నాన్నను మీ అమ్మే చంపేసింది. నిద్రమాత్రలను నేనే మీ అమ్మకు ఇచ్చాను’ అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో మృతుడి సోదరుడు సత్తిబాబు దుర్గాప్రసాద్‌ది సహజ మరణం కాదని, అతని భార్యనే హత్య చేసిందని భావించి ఈనెల 9న సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సర్పవరం ఎస్‌హెచ్‌వో ప్రకాశ్.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా, భర్తను తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. నిందితురాలు దేవితో పాటు ఆమె ప్రియుడు గోపిసాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని సీఐ తెలిపారు.