కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ప్రమాదం
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:17 AM
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు (కేఎంటీపీ)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గీసుగొండ మండలం శాయంపేటహవేలి శివారులో..
స్టీమ్ పైపు పేలి ఇద్దరు టెక్నీషియన్లు సజీవ దహనం
గీసుగొండ/వరంగల్ కలెక్టరేట్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు (కేఎంటీపీ)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గీసుగొండ మండలం శాయంపేటహవేలి శివారులో గల గణేష్ ఎకోటెక్ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో స్టీమ్ పైపు పగిలి ఇద్దరు టెక్నీషియన్‌లు సజీవదహనమయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూర్యప్రకాష్ (34), వారాణసికి చెందిన వినోద్‌కుమార్ ప్రజాపతి (31) లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సుమారు 40మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, మంటలను అదుపులోకి తెచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఈ సంఘటనపై జిల్లా ఇన్‌చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ తదితరులు విచారం వ్యక్తం చేశారు. మరో సంఘటనలో కంపెనీ బస్సు రివర్స్ చేస్తుండగా టైర్ కింద పడి ఓ మహిళ మృతిచెందింది.