Share News

ఉన్మాదిపై పోలీసు కాల్పులు

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:02 AM

తనను ప్రేమించలేదన్న కక్షతో బాలిక గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది వెంకటేశ్‌ పోలీసులపై దాడికి తెగబడ్డాడు. ఆపై పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.

ఉన్మాదిపై పోలీసు కాల్పులు

  • ఖాజీపేటలో బాలిక గొంతుకోసి పరారైన వెంకటేశ్‌

  • అదుపులోకి తీసుకోగా పోలీసులపై దాడి

  • ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

  • కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న పోలీసులు

కడప, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): తనను ప్రేమించలేదన్న కక్షతో బాలిక గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది వెంకటేశ్‌ పోలీసులపై దాడికి తెగబడ్డాడు. ఆపై పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని రామకీర్తన(17)ను, అదే మండలంలోని ఆంజనేయకొట్టాలుకు చెందిన ఆవుల వెంకటేశ్‌ శుక్రవారం గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితున్ని ఎన్‌కౌంటరు చేయాలని, ఉరి తీయాలని, లేదంటే తమకు అప్పగించాలని మృతురాలి బంధువులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో పోలీసుల అదుపులో ఉన్న వెంకటేశ్‌ తప్పించుకుని పారిపోయాడు. అతడి ఆచూకీ కనిపెట్టి శనివారం తెల్లవారుజామున మైదుకూరు - బద్వేలు ప్రధాన రహదారిలోని బసాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, వారిపై తిరగబడ్డాడు. ఈ దాడిలో కానిస్టేబుళ్లు శివయ్య, బాలనరసింహులు గాయపడ్డారు. పారిపోతున్న వెంకటేశ్‌పైకి పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా అతని కుడికాలిలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మైదుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లను ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతోనే వెంకటేశ్‌.. అతి కిరాతకంగా రామకీర్తన గొంతుకోసి హత్య చేశాడన్నారు. మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 05:03 AM