Share News

ప్రేమించలేదని.. గొంతు కోసేశాడు!

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:01 AM

ప్రేమించాలని కొంత కాలంగా వేధింపులు.. ఆ బాలిక తనకు ఇష్టం లేదని చెప్పినా వినుకోలేదు! తన ప్రేమనే నిరాకరిస్తావా? అంటూ చివరకు బాలిక గొంతు కోసి..

ప్రేమించలేదని.. గొంతు కోసేశాడు!

  • కడప జిల్లాలో ఉన్మాది ఘాతుకం

  • తీవ్ర గాయాలతో బాలిక మృతి

ఖాజీపేట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ప్రేమించాలని కొంత కాలంగా వేధింపులు.. ఆ బాలిక తనకు ఇష్టం లేదని చెప్పినా వినుకోలేదు! తన ప్రేమనే నిరాకరిస్తావా? అంటూ చివరకు బాలిక గొంతు కోసి.. హత్య చేశాడో ఉన్మాది!! ఈ దారుణ ఘటన కడప జిల్లా ఖాజీపేటలో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే... ఖాజీపేట మండలం అగ్రహారానికి చెందిన శ్రీనివాసులు, శివమణి కుమార్తె రామకీర్తన (17) ఇటీవలనే ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. అయితే ఆమెను అదే మండలంలోని ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్‌ (19) అనే యువకుడు ప్రేమించాలని కొంత కాలంగా వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వెంకటేశ్‌ పలుమార్లు రామకీర్తనకు ఫోన్‌ చేయగా.. ఆమె స్పందించలేదు. దీంతో వెంకటేశ్‌ బాధితురాలి ఇంటికే నేరుగా వెళ్లి, తనను ప్రేమించాలని బలవంతం చేశాడు. దీనికి ఆ బాలిక తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఘర్షణ పడ్డారు. చివరకు కత్తితో ఆ బాలిక గొంతు కోశాడు. ఆ సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి ఉన్నారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రి శ్రీనివాసులు కూతురు రక్తపు మడుగులో ఉండడంచూశాడు. కొన ఊపిరితో ఉన్న కీర్తనను 108లో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.

మాకు అప్పచెబుతారా? మీరు ఎన్‌కౌంటర్‌ చేస్తారా?

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని ఇంత దారుణంగా చంపేయడాన్ని బాధిత తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. వారితో పాటు గ్రామస్థులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాజీపేట కూడలి వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు వాహనాలు రాకుండా బైపాస్‌ రోడ్డుకు మళ్లించడంతో వారిలో కోపం మరింత పెరిగి, జాతీయ రహదారిపై 3 గంటలపాటు ఆందోళన చేపట్టారు. భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ‘బాలిక గొంతు కోసిన వ్యక్తిని మాకు అప్పచెబుతారా? లేక మీరు ఎన్‌కౌంటర్‌ చేయడమో లేక ఉరి తీయడమో చేస్తారా?’ అంటూ గ్రామస్థులు బైఠాయించారు. దీనిపై తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వారితో చర్చించినా ఫలితం లేకపోవడంతో.. డీఎస్పీ బాలస్వామిరెడ్డి వచ్చి తల్లిదండ్రులతో చర్చించారు. మిమ్మల్ని ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చేస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు గ్రామస్థులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు!

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వెంకటేశ్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిద్దరిని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 11 , 2026 | 03:01 AM