Share News

జమ్మికుంట ఎస్సైపై అత్యాచారం కేసు

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:47 AM

రీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట పోలీసుస్టేషన్‌ ఎస్సై కదిరె శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ...

జమ్మికుంట ఎస్సైపై అత్యాచారం కేసు

  • తనపై అత్యాచారం చేశాడంటూ మహిళ ఫిర్యాదు

  • ఇరువురికి ఫేస్‌బుక్‌లో పరిచయం

  • సదరు ఎస్సైపై గతంలో పోక్సో కేసు !

హనుమకొండ టౌన్‌/వరంగల్‌ క్రైం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట పోలీసుస్టేషన్‌ ఎస్సై కదిరె శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హనుమకొండ సుబేదారి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సుబేదారి సీఐ మేకల రంజిత్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జమ్మికుంట ఎస్సై శ్రీకాంత్‌కు సుబేదారి పోలీసు స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ వివాహితతో ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. గతేడాది మే నెలలో సదరు వివాహిత ఇంటికి వెళ్లిన ఎస్సై శ్రీకాంత్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్నించి తరచూ ఫోన్లు చేస్తూ ఆ మహిళను వేధిస్తున్నాడు. దీనిపై ఈ నెల 15వ తేదీన బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కదిరె శ్రీకాంత్‌పై కేసు నమోదు చేశామని సీఐ రంజిత్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎస్సై శ్రీకాంత్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. కాగా, సిరిసిల్ల జిల్లా కోనారావుపేటకు చెందిన కదిరె శ్రీకాంత్‌ 2014 ఎస్సైగా విధుల్లో చేరారు. గతంలో కరీంనగర్‌లో ఎస్సైగా పని చేసిన సమయంలో శ్రీకాంత్‌పై ఎల్‌ఎండీ ఇసుక విషయంలో ఓ కేసు, మరో పోక్సో కేసు నమోదు కావడంతో సస్పెన్షన్‌ గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, ధర్మపురిలో ఎస్సైగా పనిచేస్తున్న క్రమంలో ఓ మహిళ విషయంలో కేసు నమోదు కాగా సస్పెన్షన్‌కు గురైనట్లు సమాచారం. ఈ విషయంలో బాధిత మహిళతో రాజీ కుదుర్చుకొని లక్షలు చెల్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక, రాజకీయ నాయకులు అండదండలతో పలు సెటిల్‌మెంట్‌ల్లో శ్రీకాంత్‌ జోక్యం చేసుకోగా ఉన్నతాధికారులు మందలించారని, కానీ రాజకీయనాయకులు శ్రీకాంత్‌ను కాపాడారనే చర్చ కూడా ఉంది.

Updated Date - Apr 18 , 2026 | 04:47 AM