నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:06 AM
వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై బోరే విశ్వనాథ్(31) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
వివాహేతర సంబంధమే కారణం
జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై బోరే విశ్వనాథ్(31) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. విశ్వనాథ్‌పై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరే విశ్వనాథ్‌కు జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన వివాహితతో ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. ఆమె భర్త గల్ఫ్‌లో ఉండగా సోషల్ మీడియా పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో విశ్వనాథ్ నాలుగు నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని సదరు మహిళతో సహజీవనం చేస్తున్నాడు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన భర్త పిల్లల కోసం భార్యను పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడించాడు. తాను తిరిగి భర్త వద్దకు రానని సదరు మహిళ తెలిపినట్లు సమాచారం. ఇంట్లో తల్లి లేకుండా పిల్లలు ఇబ్బంది పడుతుండడంతో విశ్వనాథ్‌పై సదరు మహిళ భర్త కోపం పెంచుకున్నాడు. శివరాత్రి సందర్భంగా విశ్వనాథ్ సహజీవనం చేస్తున్న మహిళతో బైక్‌పై సారంగాపూర్ మండలంలోని దుబ్బరాజన్న జాతరకు ఆదివారం వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు జగిత్యాలలో వీరి కోసం కాపు కాశారు. విశ్వనాథ్ జగిత్యాల బైపాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు అతడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో విశ్వనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుల్లో ఓ వ్యక్తి సదరు మహిళ తన భార్య అని విశ్వనాథ్‌తో కలిసి ఉంటోందని, అందుకే హతమార్చానని చెప్పి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విశ్వనాథ్ తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.