Share News

ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసి హత్య

ABN , Publish Date - May 17 , 2026 | 05:25 AM

తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ ప్రేమోన్మాది నడిరోడ్డుపై యువతి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల...

ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసి హత్య

  • జడ్చర్లలో ప్రేమోన్మాది కిరాతకం

  • నిందితుడిపై స్థానికుల దాడి.. సీరియస్‌

  • మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలింపు

జడ్చర్ల, మే 16 (ఆంధ్రజ్యోతి): తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ ప్రేమోన్మాది నడిరోడ్డుపై యువతి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని నిమ్మబావిగడ్డ వద్ద శనివారం జరిగింది. నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి(24) జడ్చర్ల మండలం పోలేపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రిసెప్షని్‌స్టగా పనిచేస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ఆమెకు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమం లో తనను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువకుడు కొంతకాలంగా ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చని వైష్ణవి సదరు యువకుడిని దూరం పెట్టింది. దీంతో అతడు యువతిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం సాయంత్రం వైష్ణవి విధులు ముగించుకుని బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, నిమ్మబావిగడ్డ వద్ద పొంచి ఉన్న యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, తీవ్ర ఆగ్రహంతో నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వైష్ణవి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా, స్థానికులు వెంటపడి అతన్ని చితకబాదారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

Updated Date - May 17 , 2026 | 05:25 AM