Share News

భర్త జులాయితనం, రెండోపెళ్లితో విరక్తిచెందే..

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:46 AM

కూకట్‌పల్లి పరిదిలోని కైతలాపూర్‌లో పిల్లలు కార్తీక్‌, కౌశిక్‌ను చంపేసి.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న తల్లి స్రవంతి ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి ...

భర్త జులాయితనం, రెండోపెళ్లితో విరక్తిచెందే..

  • ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న స్రవంతి

  • కుటుంబ పోషణకు పైసా ఇవ్వని భర్త ప్రవీణ్‌

  • పైగా బంధువుల అమ్మాయితో రెండో పెళ్లి

  • కైతలాపూర్‌ ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు

హైదర్‌నగర్‌,ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి పరిదిలోని కైతలాపూర్‌లో పిల్లలు కార్తీక్‌, కౌశిక్‌ను చంపేసి.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న తల్లి స్రవంతి ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి భర్త ప్రవీణ్‌ తీరు పట్ల విసుగుచెందే స్రవంతి ఈ ఘోరానికి పాల్పడిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్‌ వైద్యురాలైన తమ బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడంతో కుటుంబంలో కలతలు ఏర్పడ్డాయి. ప్రవీణ్‌ చేసేది డ్రైవర్‌ ఉద్యోగమైనా దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ జల్సాలు చేసేవాడు. కార్లను అద్దెకు తీసుకుని వరంగల్‌కు వెళ్లి అక్కడ డాక్టర్‌గా పనిచేస్తున్న బంధువుల అమ్మాయిని కలిసేవాడు. సదరు కార్లు తనవేనని చెబుతూ తన పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు చూపించి.. విలాసవంతమైన జీవితంపై ఆశలు కల్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. డబ్బులు అవసరమైనప్పుడు అద్దెకు తీసుకున్న కార్లనే తాకట్టుపెట్టి జల్సాలు చేసేవాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నా.. కుటుంబ పోషణకు ఒక్క రూపాయి కూడా స్రవంతికి ఇచ్చేవాడు కాదు. పైగా రోజూ భార్యాపిల్లలను వేధించేవాడు. స్రవంతి కైతలాపూర్‌ మెయిన్‌రోడ్డులో చిన్న కర్రీపాయింట్‌ పెట్టుకొని వచ్చే కాస్త ఆదాయంతో పిల్లలను పోషిస్తోంది. స్రవంతి.. మంగళవారం పిల్లలను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. భర్త తీరుపట్ల జీవితంపై విరక్తిచెందే ఆమె ఈ ఘటనకు పాల్పడిందని తెలుస్తోంది.

Updated Date - Apr 02 , 2026 | 02:46 AM